తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం ఈరోజు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. అయితే తమిళనాడు ఎన్నికల్లో కొద్దిరోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఇప్పుడే రజనీకాంత్ ఎందుకు గుర్తొచ్చాడని రాజకీయ విశ్లేషకులు కేంద్రంలోని బీజేపీ సర్కారును ప్రశ్నిస్తున్నారు. కేవలం ఆయన్ను మచ్చిక చేసుకుని కొన్ని ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడ ఇది అని వారు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల జిమ్మిక్కు అంటూ విమర్శలు చేస్తున్నారు.
తమిళనాడులో ఈనెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలుత రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగుదామని రజనీకాంత్ భావించినా.. ఆరోగ్యం సహరించకపోవడంతో ఆయన వెనక్కి తగ్గారు. దీంతో ఆయన పరోక్షంగా బీజేపీకి మద్దతు తెలుపుతున్నారని తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే ఇప్పుడు ఉన్నపళంగా రజనీకాంత్‌కు చిత్రపరిశ్రమలోని అత్యున్నత అవార్డు అందించారని టాక్ వినపడుతోంది. ఈ ఎత్తుగడతో వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి ఎన్ని ఓట్లు రాలుస్తాయో వేచి చూడాలి.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలు వచ్చాయి. కాగా రజనీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా ఏపీ సీఎం జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.