Friday, November 22, 2024

Delhi | బీసీ కులగణన ఎందుకు చేయరు?, కేంద్రానికి బీసీ సంఘం ప్రశ్నలు.. ఏపీ, తెలంగాణ‌ ఎంపీల మద్దతు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు కావస్తున్నా బీసీలకు చేసిందేమీ లేదని, పైగా వెనుకబడిన వర్గాల వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీల ఓట్లతో గెలిచి, బీసీ కులగణన చేయని ప్రభుత్వానికి బీసీలు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. బుధవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ జన గణనలో బీసీ కులగనణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జనగణన దీక్ష నిర్వహించారు.

ఉదయం 10 గంటలకు టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ తెలంగాణ అధ్యక్షులు కేశన శంకర్రావు, కుల్కచర్ల శ్రీనివాసులకు పూలమాలవేసి దీక్షను ప్రారంభించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, వైఎస్సార్సీపీ, టీడీపీ సహా 25 పార్టీలు బీసీ కుల గణనకు మద్దతు తెలిపాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఒక్క బీజేపీ మాత్రమే బీసీ కులగణనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించకపోతే 2024 ఎన్నికలే బీజేపీకి చివరి ఎన్నికలవుతాయని ఆయన హెచ్చరించారు.

బీసీ ప్రధాని అని ఎలా చెప్పుకుంటారు : కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎల్లప్పుడూ తాను బీసీ ప్రధానినని చెప్పుకునే ప్రధాని మోదే వారి కోసం ఏం చేశారని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బీసీ కులగణన, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, చట్టసభలలో బీసీ రిజర్వేషన్లు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ఇటీవల రాయపూర్‌లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీలో బీసీ డిమాండ్లపై తీర్మానం చేశామని, తమ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేసి తీరతామని స్పష్టం చేశారు.

- Advertisement -

పార్లమెంట్‌లో పోరాడతాం : టీడీపీ ఎంపీ కనకమేడల
బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారని, ఈ అంశంపై పార్లమెంట్ లోపల, బయట పోరాడతామని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ తేల్చి చెప్పారు. బీసీ కులగణన ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని, బీసీల సమగ్ర అభివృద్ధి జరుగుతుందని తాము గట్టిగా నమ్ముతున్నామని అన్నారు.

బీసీ కులగణన చేసి తీరాల్సిందే : బీఆర్‌ఎస్ ఎంపీ బీబీ పాటిల్
బీసీ కుల గణన చేపట్టాలంటూ మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తమ ప్రభుత్వం తీర్మానం చేసిందని బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ పాటిల్ గుర్తు చేశారు. బీసీలకు మేలు చేయని ప్రధాని ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటేనని ఎద్దేవా చేశారు.

బీసీ వ్యతిరేక పార్టీ బీజేపీ : కేస‌న శంకర్రావు
బీసీ డిమాండ్లను నెరవేర్చకుండా బీజేపీ ప్రభుత్వం అణిచివేస్తోందని, మండల్ ఉద్యమం నుంచి ఇప్పటివరకు ఆ పార్టీ తమ బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవడం లేదని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు విమర్శించారు. బీసీల సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement