న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హిందూమతానికి ఛాంపియన్లమని చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం దేవాలయాలపై జీఎస్టీ ఎందుకు వసూలు చేస్తోందని రాజమండ్రి ఎంపీ, వైఎస్సార్సీపీ లోక్‌సభ చీఫ్ విప్ మార్గాని భరత్ ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో వైఎస్సార్సీపీ ఎంపీలు వంగ గీత, డాక్టర్ సత్యవతి, గొడ్డేటి మాధవి, గురుమూర్తితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం, ధరల నియంత్రణలో పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైందన్న ఆయన,పేదవాడి ఇబ్బందులు తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. వంట నూనె ధరల నియంత్రణలో విఫలమయ్యారు, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ దాదాపు 13 శాతం ఈ మధ్యకాలంలో పతనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సోలార్ ఎనర్జీపై 18శాతం జీఎస్టీ ఎందుకు వేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఓవైపు సోలార్ విద్యుత్‌ను ప్రోత్సాహించాలని చెబుతూ ఈ విధంగా పన్నులు వేయడం సరికాదని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తయితే జలవిద్యుత్ కూడా అందుబాటులోకి వచ్చేదని, కేంద్రం పునరావాస ప్యాకేజీ ఇవ్వకపోవడం వల్ల పోలవరం ఆలస్యమవుతోందని భరత్ చెప్పుకొచ్చారు. వంటనూనెలు దిగుమతి కన్నా దేశంలో ఉత్పత్తి పెంచడంపై ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఇంధనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎందుకు అన్వేషించడం లేదన్నారు. కేంద్రం నుండి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా ఆదాయం 31 శాతానికి పడిపోయిందని, రాష్ట్రానికి ఇవ్వాల్సిన 18 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటును కేంద్రం వెంటనే విడుదల చేయాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రణలోకి తెచ్చి సామాన్యునికి ఊరట కలిగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ కౌన్సిల్‌లో మెజారిటీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండడం వల్ల వారు తీసుకునే నిర్ణయాలు ఆమోదం పొందుతున్నాయని, మిగిలిన రాష్ట్రాల వాదన నెగ్గడం లేదని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం ఎంపీ వంగా గీత మాట్లాడుతూ… పార్లమెంట్ ఉభయ సభల్లో దేశవ్యాప్తంగా ధరల పెరుగుదలకు కేంద్ర ఆర్ధిక మంత్రి కారణాలు చెప్పారే తప్ప పరిష్కార మార్గాలు చెప్పలేదని విమర్శించారు. కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వమే కాదు, సామాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆమె చెప్పుకొచ్చారు. ధరలు పెరిగి, ఉద్యోగాలు కోల్పోయి, అనారోగ్యం బారినపడి ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ఊరట కలిగించే చర్యలేవని గీత ప్రశ్నించారు. పేద ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదన్న ఆమె, మానవతా ధృక్పథంతో ఆలోచించి పేదప్రజలపై భారం తగ్గించాలని ప్రధాని, కేంద్ర ఆర్ధిక మంత్రులకు విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.