ఓవైపు కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే లీకైందని అంతర్జాతీయ సమాజం అనుమానం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు, చైనా మాత్రం ఇవేవీ పట్టనట్టు ప్రవర్తిస్తోంది. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచి ఈ వైరస్ బయటకు వచ్చినట్టు ఇప్పటికే నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు. అయితే, కరోనా వైరస్‌ను జీనోమ్ చేసిన, మహమ్మారిపై విసృత పరిశోధనలు చేసినందుకు వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ కు మెడిసిన్ రంగంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చైనా డిమాండ్ చేస్తున్నది. తాము ఈ వైరస్ గురించి పరిశోధనలు చేసి జీనోమ్‌ను సీక్వెన్స్ చేసి ఉండకుంటే ఇంకా ప్రపంచం ఇబ్బందులు పడేదని చెప్పుకొచ్చింది.
ఇక చైనా డిమాండ్‌పై సోషల్ మీడియాలో అనేక కామెంట్లు వస్తున్నాయి. ప్రపంచాన్ని, ప్రజల జీవితాలను నాశనం చేయడానికి వూహాన్ ల్యాబ్ ఎంతగానో కృషిచేసిందని, ప్రజల జీవితాలను నాశనం చేసినందుకు వూహాన్ ల్యాబ్‌కు తప్పకుండా నోబెల్ ఇవ్వాలని, అలానే, ప్రపంచంలో మారణకాండ సృష్టిస్తున్న ఐసిస్‌కు కూడా శాంతి బహుమతి ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.