Friday, November 22, 2024

కన్నడ పీఠం ఎవరిది.. రేపు కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు

దేశంలో అందరి దృష్టి ఇప్పుడు కర్నాటకపైనే ఉంది. శాసనసభ ఎన్నికల్లో కన్నడిగులు తీర్పు ఇవ్వడానికి మరొక్క రోజు మాత్రమే గడువుంది. ‘ప్రతి ఒక్క కన్నడిగుని కలే నా స్వప్నం.. భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కన్నడసీమలో కమలం వికసించడం ద్వారా ఆ కల సాకారమవుతుంది. మీ అపరిమితమైన ప్రేమను ఓటువేసి చాటండి’ అంటూ ప్రధాని నరేంద్రమోడీ మంగళవారంనాడు బహిరంగ లేఖలోను, వీడియో సందేశంలోనూ పేర్కొనడం ఓ రాజకీయ ఎత్తుగడ. ప్రజల మనసును తాకేలా మాట్లాడటంలో దిట్ట అయిన మోడీ ఇప్పుడు లేఖను వదిలారు. అలా కోరడం తప్పేమీ కాదు కూడా.

అయితే, కర్నాటక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో 18 బహిరంగ సభల్లోను, 6 మెగా రోడ్‌షోలలోనూ సుడిగాలిలా చుట్టేసిన మోడీ వినతిని కన్నడిగులు మన్నిస్తారా? సంక్షేమం నుంచి బజరంగ్‌ బలీ నినాదం వరకు మోడీ నోట వచ్చిన మాటల తూటాల ప్రభావం కన్పిస్తుందా? పాల వివాదం, విషసర్పం, జోకర్‌ వంటి విమర్శలు వికటిస్తాయా? తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్‌ – బీజేపీ మధ్య పోరు హోరాహోరీగా ఉంది. జేడీఎస్‌ తృతీయ స్థానంలో నిలిచినా హంగ్‌ పరిస్థితులొస్తే కింగ్‌మేకర్‌ పాత్ర పోషించాలని ఆశతో ఉంది. కానీ, కాంగ్రెస్‌ – బీజేపీలలో ఎవరో ఒకరికి పూర్తి మెజారిటీ దక్కే అవకాశాలున్నట్లు ఒపీనియన్‌ పోల్స్‌ సూచిస్తున్నాయి.

1985 తరువాత, గడచిన 38 ఏళ్లుగా ఏ పార్టీకి వరుసగా అధికారం కట్టబెట్టని కన్నడిగులు ఈసారి ఆ సంప్రదాయాన్ని పాటిస్తారా? లేక కొత్త చరిత్రను సృష్టిస్తారా అన్నది ప్రశ్న. ఈ ఎన్నికల్లో 40 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఇప్పటివరకు వచ్చిన మెజారిటీ ఒపీనియన్‌ పోల్స్‌ చెబుతున్నాయి. అయితే, బీజేపీ వీటిని కొట్టి పారేస్తోంది. గడచిన మూడు నాలుగు నెలలుగా కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ… ఆ పార్టీ మేనిఫెస్టోలో బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని పేర్కొనడంవల్ల రాజకీయ సమీకరణలను మారతాయన్నది వారి అంచనా. ఇక్కడ సాంకేతికంగా ఓ విషయాన్ని చెప్పుకోవాలి. గత శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకీ మ్యాజిక్‌ మార్క్‌ లభించలేదు.

- Advertisement -

కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌తో కలసి కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒక్క ఏడాదికే ఆ ప్రయోగం వికటించింది. ఆ తరువాత కాంగ్రెస్‌, ఇతర పార్టీల నుంచి కొందరు శాసనసభ్యులు బీజేపీకి మద్దతివ్వడంతో కమలనాధులు అధికారంలోకి వచ్చారు. అందువల్ల ప్రజలు అధికారం కట్టబెట్టింది సాంకేతికంగా కాంగ్రెస్‌, మిత్రపక్షాలకే. ఆ లెక్కన ఇప్పుడు బీజేపీకి అధికారం దక్కవచ్చన్నది బీజేపీలోని ఒకవర్గం వాదన.

224 అసెంబ్లి స్థానాలున్న కర్నాటకలో అధికారం చేపట్టడానికి (మేజిక్‌ నెంబర్‌) 113 మంది ఎమ్మల్యేల బలం ఉండాలి. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచినప్పటికీ సంకీర్ణ ప్రయోగం విఫలమవడంతో బీజేపీ గద్దెనెక్కి నాలుగేళ్లుగా అధికారం చెలాయిస్తోంది. మొదట యెడ్యూరప్పను సీఎం పీఠంపై కూర్చోపెట్టిన బీజేపీ అధిష్ఠానం ఆ తరువాత ఆయనను మార్చి బసవరాజ్‌ బొమ్మైకు అధికారం అప్పగించింది. అవినీతి ఆరోపణలు, అసమర్ధ పాలకుడిగా విమర్శలపాలైన బొమ్మై నేతృత్వంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. దక్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రంలో సంప్రదాయానికి భిన్నంగా రెండోసారి వరుసగా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గత ఏడాదిగా రాష్ట్రంలో విస్తృత పర్యటనలు జరపడం, ఎన్నికల చివర్లో ప్రధాని నరేంద్రమోడీ విస్తృత సంఖ్యలో బహిరంగ సభలు పాల్గొనడం, లెక్కలేనన్ని భారీ రోడ్‌షోలలో పాల్గొనడంతో జాతి దృష్టి ఈ ఎన్నికలపై కేంద్రీకృతమైంది.

కర్నాటకంలో కులం, రిజర్వేషన్లు, సంక్షేమం, సరిహద్దు వివాదం, పాలు, చివరకు పాముల ప్రస్తావన వచ్చింది. సాక్షాత్తు ప్రధానిని విషనాగుగా వర్ణిస్తూ ఏఐసీసీ సారధి మల్లికార్జున ఖర్గేవంటివారు చవకబారు విమర్శలకు దిగారు. ప్రచారం చివరి దశకు చేరిన వేళ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన బహిరంగ సభలు, రోడ్‌షోలు పూర్తిగా బీజేపీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించాయన్న వాదన వినిపిస్తోంది. అయితే, కన్నడిగుల నాడిని పట్టడం అంత సులువుకాదు. రాష్ట్రంలో కులమత ప్రస్తావన, ఓట్‌బ్యాంక్‌ రాజకీయాలు లేకుండా ఎన్నికలు సాగవు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మతపరమైన మఠాలు, వాటి పీఠాధిపతులు, మైనారిటీలు, రాష్ట్రంలో ప్రధాన కులాలైన వొక్కళిగులు, లింగాయత్‌లు కీలకం. రాజకీయ ఉపన్యాసమైనా, హామీ అయినా వారి చుట్టూనే తిరుగుతాయి. ఆరునూరైనా అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న బీజేపీ కూడా ఆయా అంశాలకే ప్రాధాన్యం ఇచ్చి వ్యవహరించింది. నిజానికి రాష్ట్రంలో దళితులు మెజారిటీగా ఉన్నప్పటికీ రాజకీయంగా లింగాయత్‌లు (16 శాతం), ఒక్కళిగులు (14శాతం), ముస్లిం మైనారిటీలు (12 శాతం) కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పటివరకు కర్నాటకలో 23మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే 16 మంది లింగాయత్‌ -వొక్కళిగ సామాజిక వర్గానికి చెందినవారే. ప్రధానంగా దక్షిణ కర్నాటకలో వీరి ప్రాబల్యం ఎక్కువ.

ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ.. సరిహద్దులలోని కర్నాటక ప్రాంత గ్రామాల్లో కొన్నింటిని తమ రాష్ట్రంలో కలిపేయాలంటూ మహారాష్ట్ర నాయకులు చేసిన ప్రకటనలు బీజేపీకి సంకటంగా మారాయి. ఇరు రాష్ట్రాలలోనూ బీజేపీయే అధికారంలో ఉండటంతో కాంగ్రెస్‌కు అది ఓ ఆయుధంలా మారింది. బెల్గావి సరిహద్దువివాదం నేపథ్యంలో ఇరు రాష్ట్రాలలో (బెల్గాం-పుణ) విధ్వంసం, ఘర్షణలు చెలరేగాయి. ఆ తరువాత సద్దుమణిగినా ఎన్నికల్లో ఇది ప్రభావం చూపే అంశమే. ఇది కాంగ్రెస్‌కు సానుకూలంగా పరిణమించే అవకాశం ఉంది. మొదట్లో మతపరమైన ఓటుబ్యాంకును ఏకం చేసి లబ్ధిపొందాలని చూసిన బీజేపీ, హిజాబ్‌ – హలాల్‌ – అజాన్‌ నినాదంతో వివాదాలను అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించింది. మోరల్‌ పోలీసుల్లో క్రిస్టియన్లు, మైనారిటీలను తొలగించాలని, మైనారిటీల దుకాణాల్లో వస్తువులను కొనరాదన్న వాదనలు లేవనెత్తింది. అయితే, ఆ వ్యూహం వికటిస్తోందని గ్రహించి సంక్షేమ నినాదాన్ని అందుకుంది.

అప్పటి నుంచి రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులు విడుదల చేసి విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టింది. వాటిని ప్రధాని స్వయంగా ప్రజలకు అంకితం చేసి ఎన్నికల ప్రసంగాలను దంచికొట్టారు. మైసూరు – బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఎయిర్‌పోర్టులు.. ఇలా లక్షల కోట్ల నిధులతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఇది బీజేపీకి లబ్ధి చేకూర్చే అంశంగానే భావిస్తున్నారు. ఇక రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన పక్షాలన్నీ తమతమ అస్త్రాలుగానే చూస్తున్నాయి. ముస్లిం మైనారిటీలకు అమల్లో ఉన్న 4 శాతం ఓబీసీ కోటాను రద్దు చేసి లింగాయత్‌లు, వొక్కళిగులకు సర్దుబాటు చేయడం ద్వారా బీజేపీ ప్రభుత్వం ప్రధాన కులాలవారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే, దీనిపై కాంగ్రెస్‌ ఎదురుదాడి చేసింది. తాము అధికారంలోకి వస్తే మళ్లిd ముస్లిం మైనారిటీల రిజర్వేషన్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. అయితే జగదీష్‌ షెట్టార్‌ వంటి నేతలు కాంగ్రెస్‌కు వెళ్లిపోవడంవల్ల లింగాయత్‌లలో బీజేపీ పట్టు తగ్గుతుందని ఓ అంచనా.

కానీ అమిత్‌ షా అదేమీ పెద్దవిషయం కాదని, షెట్టార్‌ ఓటమిపాలవుతారని జోస్యం చెప్పారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గట్టిగా పోరాడుతోంది. బీజేపీని కుదురుగా కూర్చోనివ్వడం లేదు. రాష్ట్రంలో అమూల్‌ పాల అమ్మకాల అంశాన్ని పెద్ద అస్త్రంగా మార్చుకోగలిగింది. రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని పాడిసమాఖ్య అందించే నందిని పాల విక్రయాలను దెబ్బతీసేందుకే అమూల్‌కు అనుమతిచ్చారంటూ ప్రచారం చేసింది. మెజారిటీ నియోజకవర్గాలలో పాడి రైతుల ప్రభావం ఎక్కువ. దాంతో అప్రమత్తమైన బీజేపీ మేనిఫెస్టోలో సరిదిద్దే ప్రయత్నం చేసింది. తాము అధికారంలోకి వస్తే నందిని పాలను పరిమితంగా ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. తద్వారా నందినిపై వ్యతిరేకత లేదని చాటుకునే ప్రయత్నం చేసింది. ఈ అంశంలో బీజేపీకి కాస్త వ్యతిరేకత ఎదురవ్వవచ్చు.

ఇక బసవరాజు బొమ్మై సారథ్యంలోని ప్రభుత్వం అవినీతిమయం అయ్యిందని కాంగ్రెస్‌ ప్రధాన ఆరోపణ. ఏకంగా ఆయనను పేటీఎం సీఎంగాను, 40 శాతం కమిషన్‌ ప్రభుత్వంగానూ తూర్పారపట్టింది. రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు డా.డి.కెంపన్న చేసిన ప్రకటనను ఉటంకిస్తూ ప్రభుత్వంపై ఎదురుదాడి చేసింది. మంత్రి కె.ఎస్‌. ఈశ్వరప్ప వేధింపులవల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకోవడం వంటి పరిణామాలు బీజేపీకి తలనొప్పులు తెచ్చేవే. గడచిన నాలుగేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏకంగా రూ1.50 లక్షల కోట్లు లూటీ చేసిందని రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేయడం విశేషం. అయితే, రాజీవ్‌గాంధీ హయాంలో ప్రభుత్వ పథకాల్లో ఒక్కో పౌరుడిగి కేటాయించిన రూపాయిలో కేవలం 15 పైసలే చేరేదని ప్రధాని తన ప్రసంగాల్లో మోడీ ఎదురుదాడి చేశారు.

ఈ వాదనకు పెద్ద పస లేదు. బొమ్మై ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు బీజేకి చికాకు పరిచేవే. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కాంగ్రెస్‌ చేసిన రెండు పొరపాట్లను కమలనాధులు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేశారు. ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన పీఎఫ్‌ఐతోపాటు బజరంగ్‌ దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక వివాదాస్పదమైంది. హిందువుల మనోభావాలను రెచ్చగొట్టి లబ్ధిపొందేందుకు బీజేపీ ప్రయత్నించింది. చివరకు ప్రధాని మోడీ ఏకంగా బజరంగ్‌ బలీ అంటూ ప్రజలనుంచి మద్దతు పొందేలా ప్రంగించడం విశేషం. చివరకు మంగళవారంనాడు బీజేపీ నేతలంతా రాష్ట్రం అంతటా హనుమాన్‌ చాలీసా పఠించడం ఓ ఎన్నికల ఎత్తుగడ. ఈ వివాదం కాంగ్రెస్‌ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందని, అయితే, ఎంతమేర అన్నది చెప్పలేమని ఆ పార్టీవారే ఒప్పుకుంటున్నారు. ఈ వివాదం ఎంత ప్రతికూల ప్రభావం చూపుతుందో కాంగ్రెస్‌ గ్రహించింది. హనుమాన్‌ అంటే తమకు వ్యతిరేకత లేదని డీకే శివకుమార్‌ వంటివారు బహిరంగంగా చెప్పుకోవలసి వచ్చింది.

మల్లికార్జున్‌ ఖర్గే అయితే తన ఎన్నికల ప్రచార సభలో ముక్తాయింపుగా జై బజరంగ్‌ బలి అని నినదించడం విశేషం. నిజానికి ఓటమి భయంతో దిగులుగా ఉన్న నేతలకు ఈ వివాదం తరువాత గెలుపు నమ్మకం పెరిగిందనే చెప్పాలి. ఇక ప్రధాని మోడీని మల్లికార్జున్‌ ఖర్గే వంటి వ్యక్తి విషసర్పంగా పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు వికటించాయి. దానిని ప్రధాని అనుకూలంగా మార్చుకుని.. శివుని మెడలో కూడా సర్పం ఉంటుందని, చెడ్డవారిని కాటేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ వివాదం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారగా బీజేపీకి అనుకూలంగా పరిణమించిందన్నది ఆ పార్టీ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. ఇక బీజేపీ ఆశలన్నీ ప్రధాని మోడీపైనే. ఆయన జనాకర్షణపైనే. బెంగళూరులో 23 కి.మి. రోడ్‌షోకు అశేష జనవాహిని రావడం, కన్నడిగుల మనసుదోచేలా ప్రసంగించడం, అభివృద్ధి పనులను ప్రారంభించడం, కేంద్రం ఏమేమి చేసిందో చెప్పడం, డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాల ప్రయోజనాలు వల్లెవేయడం వంటివి అనుకూలిస్తాయని భావిస్తున్నారు.

ధర్వాడ్‌ ఐఐటీ, గడగ్‌ ఎయిమ్స్‌, బెంగళూరు – మైసూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే, భాగల్‌కోట్‌ టాయ్‌ ఫ్యాక్టరీ రైల్వేలైన్స్‌, కొత్త ఎయిర్‌పోర్టులు, అధునాత మౌలిక సదుపాయాల వంటివి కార్యరూపంలోకి వచ్చినవే. ఇక రాహుల్‌ యాత్ర, ప్రియాంక సహా సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ వంటి అనుభవజ్ఞుల వ్యూహాలను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. శాసనసభ ఎన్నికల్లో స్థానిక అంశాలను ఓటర్లు ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు. ప్రధాని, రాహుల్‌ వంటి వారి పాత్ర, ప్రభావం ఎంతమేర అన్నది చెప్పలేం. ఓటర్ల దృష్టికోణంలో జాతీయ నాయకులకు ప్రాధాన్యం ఇచ్చి, వారు చెప్పే అంశాలను ఆలకిస్తే.. విశ్వసిస్తే ప్రయోజనం పొందేది బీజేపీయేనని చెప్పొచ్చు. రాష్ట్ర అంశాలకే ప్రాధాన్యం ఇస్తే, కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రజల తీర్పు ఉండవచ్చు. 93 ఏళ్ల మాజీ ప్రధాని దేవెగౌడ, తనయుడు కుమారస్వామి సారథ్యంలోని జేడీఎస్‌ను తీసిపారేయలేం. తృతీయ స్థానంలోనే నిలవబోతున్నప్పటికీ తుడిచిపెట్టుకుపోయే పార్టీ కాదు. గతంకన్నా వారి పట్టు తగ్గిందని భావిస్తున్న కొన్ని పార్టీలు, నేతలు వారిని, ఆ పార్టీని ‘జోకర్లు’గా పరిహాసం చేయడం తెలివితక్కువ తనమే. ఎందుకంటే వొక్కళిగుల మద్దతు, పట్టు ఉన్న జేడీఎస్‌.. కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశాలూ ఉన్నాయి. ఏ పార్టీకీ మెజారిటీ రానప్పుడు ఆ జోకరే కింగ్‌ మేకర్‌ అవుతారు మరి!

కర్నాటకంలో గణాలు.. గణాంకాలు

అసెంబ్లి సీట్లు
224 శాసనసభ స్థానాలు
113 మ్యాజిక్‌ మార్క్‌
మే 10 పోలింగ్‌
మే 13 ఫలితాలు

ఎవరెన్ని స్థానాల్లో పోటీ
224 – బీజేపీ
223 – కాంగ్రెస్‌
207 – జేడీఎస్‌

ఓటర్లు
మొత్తం : 5,21,73,579
పురుషులు : 2.62 కోట్లు
మహిళలు : 2.59 కోట్లు
తొలిసారి ఓటు హక్కు పొందినవారు : 9.17 లక్షలు
పోలింగ్‌ స్టేషన్లు : 58,282

Advertisement

తాజా వార్తలు

Advertisement