హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 9 ఏళ్లకు వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పోస్టు మంజూరైంది. డీఎంఈతో పాటు అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ పోస్టులు కూడా మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పూర్తి స్థాయి వైద్య విద్య సంచాలకుల నియామకానికి మార్గం సుగమమైంది. ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో డీఎంఈ పోస్టుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ పోస్టులో ఇన్‌చార్జి డీఎంఈ హోదాలో డా.రమేశ్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన ఇన్‌చార్జి డీఎంఈగా నియామకం అయిన సమయంలోనే వివాదం చెలరేగింది. సీనియార్టీ లిస్టులో ఎంతో మంది ఉన్నప్పటికీ వారందరినీ కాదని రమేశ్ రెడ్డికి ఆ పదవి ఇవ్వడం సరికాదని ఆ పోస్టును ఆశించిన సీనియర్లు హైకోర్టును సైతం ఆశ్రయించారు.
అయితే, ఏపీ పునర్విభజన చట్టంలో డీఎంఈ పోస్టు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో తెలంగాణలో డీఎంఈగా ఇన్‌చార్జితోనే సరిపెట్టాల్సి వచ్చింది. తాజాగా, తెలంగాణకు పూర్తి స్థాయి డీఎంఈ పోస్టును జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇక ఆ పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ వైద్య వర్గాలలో నెలకొంది. అయితే, డీఎంఈ పోస్టుకు ఎవరిని నియమించాలనే అంశం పూర్తిగా సీఎం నిర్ణయాధికారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రస్తుతం డీఎంఈ పోస్టుకు సీనియార్టీ ప్రకారం ఐదుగురు పోటీలో ఉన్నట్లు సమాచారం. వీరిలో డా.శివరాం ప్రసాద్, డా.నరేంద్ర కుమార్, డా.వాణి, డా.రమాదేవి డా.నాగేందర్ ఉన్నారు.
ప్రస్తుతం అడిషనల్ డీఎంఈ కేడర్‌లో ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరిని డీఎంఈగా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, నిరుపేదలకు సైతం వైద్య విద్యను చేరువ చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది కొత్తగా 9 మెడికల్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయి డీఎంఈ పోస్టును మంజూరు చేయడంతో రాష్ట్ర్రంలో వైద్య విద్య మరింత బలోపేతం కానుంది.
సీనియార్టీ ప్రాతిపదికనే డీఎంఈ ఎంపిక జరగాలి
డీఎంఈతో పాటు ఇతర అడ్మిన్ పోస్టులు కొత్తగా మంజూరు చేయడం పట్ల తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈమేరకు టిటిజిడిఏ అధ్యక్షుడు డా.అన్వర్, ప్రధాన కార్యదర్శి డా.జలగం తిరుపతి రావు సీనియార్టీ ప్రాతిపదికన ప్రభుత్వం త్వరలో సమర్థుడైన వ్యక్తిని డీఎంఈగా నియమిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోస్టులతో పరిపాలన సులభతం అవుతుందనీ, సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు.