Wednesday, November 20, 2024

కాంగ్రెస్‌ పార్టీ కొత్త చీఫ్‌ ఎవరు.. నవ్‌ సంకల్ప చింతన్‌ శిబిర్‌లో స్పష్టత వస్తుందా?

కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్య ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మే 13న ఉదయ్‌పూర్‌(రాజస్థాన్‌)లో ”నవ్‌ సంకల్ప చింతన్‌ శిబిర్‌” నిర్వహణకు సన్నద్ధమవుతోంది. మూడు రోజుల మేధోమధనంలో నాయకత్వ సమస్యపై స్పష్టత వస్తుందా అని పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి పార్టీ కొత్త చీఫ్‌ ఎన్నిక కావల్సి ఉంది. అయితే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహణ సాధ్యమేనా? ఆరు కోట్లకు పైగా ఉన్న పార్టీ సభ్యులు నేరుగా పాల్గొనగలరా? అని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అయితే కేంద్ర ఎన్నికల అధికారం (సీఈఏ)లోని వర్గాలు ఈ ఆలోచనను తోసిపుచ్చుతున్నాయి. దీనికి పార్టీ రాజ్యాంగంలో మార్పు అవసరమని వాదన వినిపిస్తోంది. పార్టీలో అంతర్గత సంస్కరణల తీసుకురావాలని కోరుతూ రెండేళ్లుగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వరుస లేఖల ద్వారా జీ-23 సభ్యులు ఒత్తిడి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వారి తిరుగుబాటు తర్వాత ఎన్నికల నిర్వహణకు మొగ్గుచూపారు. రాహుల్‌గాంధీ కూడా ఇందుకు మద్దతిచ్చారు. అయితే ఆరు కోట్ల మంది సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీని నిర్వహించడం సాధ్యం కాదని సీఈఏ వర్గాలు వాదిస్తున్నాయి.

ఏప్రిల్‌ 15న పార్టీ తన సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేసింది. దాదాపు రెండు కోట్ల మందికి పైగా సభ్యులు డిజిటల్‌ సభ్యత్వం కూడా నమోదు తీసుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధ్యక్షుడిని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు ఎన్నుకుంటారు. పీసీసీ ప్రతినిధులను జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు (డీసీసీలు), బ్లాక్‌ కమిటీల నుంచి ఎన్నుకోబడతారు. బూత్‌ స్థాయి లేదా ప్రాథమిక కమిటీ సభ్యులచే ఎన్నుకోబడతారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులను ఎన్నుకోవడం కోసం ఎలక్టోరల్‌ కాలేజీని ఏఐసీసీ ఏర్పాటు చేసింది. వీరిని పీసీసీ, డీసీసీల నుంచి ఎంపిక చేయబడతారు.

ప్రస్తుత వ్యవస్థలో సుమారు 8 నుంచి 9 వేల మంది పీసీసీ ప్రతినిధులు కాంగ్రెస్‌ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ ఎన్నికల అధికార సభ్యుడొకరు తెలిపారు. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం, సెప్టెంబర్‌ నాటికి కొత్త చీఫ్‌ను ఎన్నిక కాబడతారు. పోటీనా లేదా ఏకగ్రీవ ఎన్నిక ఉంటుందా అన్న అంశంపై ఇంకా ఎలాంటి సూచనలు, సలహాలు లేవు. గాంధీ కుటుంబ విధేయులలో ఒక వర్గం పూర్తిస్థాయి పార్టీ చీఫ్‌గా రాహుల్‌గాంధీ తిరిగి బాధ్యతలు చేపట్టాలని ఒత్తిడి చేస్తోంది. అయితే అంతర్గత ఎన్నికలలో అతను అభ్యర్థి అవుతాడా లేదా అనే విషయం ఇంకా తేలలేదు. గుజరాత్‌, తెలంగాణ వంటి రాష్ట్రాల పర్యటనలతో రాహుల్‌గాంధీపై పార్టీ బాధ్యతలు తీసుకోవాలని ఆయన అనుకూలురు మరింత ఒత్తిడి తెచ్చినట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.

మరోవైపు రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌ వంటి కొంతమంది జీ-23 నాయకులు గాంధీయేతర వ్యక్తి పార్టీ చీఫ్‌గా ఉండాలని, పార్లమెంటరీ పార్టీకి రాహుల్‌గాంధీకి నాయకత్వం వహించాలని సూచిస్తున్నారు. మరికొందరు సోనియాగాంధీనే 2024 లోక్‌సభ ఎన్నికల వరకు కొనసాగాలని కోరుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగారు. అధ్యక్ష బాధ్యతలు గాంధీయేతరుడికి అప్పగించాలని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలోనూ, సీడబ్యూసీ, ఏఐసీసీ విస్తృత సమావేశాల్లో రాహుల్‌గాంధీ పార్టీ సహచరులను కోరిన విషయం తెలిసిందే. కుటుంబం వెలుపల ఏ వ్యక్తి పేరునైనా సూచించమని విజ్ఞప్తి చేశారు. అయితే ఏ పేరుపైనా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సోనియాగాంధీని తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో సోనియా పార్టీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 2019లో తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటి నుంచి అధ్యక్షుడి ఎంపికపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ అంశంపై పలు సూచనలు, సలహాలు కూడా వచ్చాయి. తుదకు ఎన్నికల నిర్వహణకు పార్టీ మొగ్గుచూపింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టి, ఇటీవలనే పూర్తి చేసింది. మే 13 నుంచి మూడ్రోజుల పాటు ఉదయ్‌పూర్‌లో మేధోమధనం నిర్వహించతలపెట్టింది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంతోపాటు 2024 ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడమే లక్ష్యంగా చింతన్‌ శిబిరంలో చర్చలు జరుగనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement