Tuesday, November 26, 2024

రారాజు ఎవరు?.. 7నుంచి వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. లండన్‌లోని ఓవల్‌ వేదికగా నేడు టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఐసీసీ కిరీటం కోసం రెండు మేటిజట్లు బరిలోకి దిగుతున్నాయి. అన్ని రంగాల్లో సమవుజ్జీలుగా ఉన్న ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య జరిగే ఈ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రికెట్‌ అభిమానులు ఆసక్తితో ఉన్నారు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన భారత్‌ ఈసారి ఎట్టిపరిస్థితుల్లో ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతోఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఇరుజట్లు సమతూకంగా ఉన్నాయి. స్టార్‌ ఆటగాళ్లతోపాటు, మ్యాచ్‌ను మలుపు తిప్పగల యువకెరటాలు ఇరుజట్లకు ఆదనపు బలంగా మారనుంది.

ఈ ఏడాది రెండు ఐసీసీ ట్రోఫీలపై గురిపెట్టిన భారత్‌, టెస్టు ట్రోఫీని గెలిచి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో వన్డే ట్రోఫీ పోరాటానికి సమాయత్తం కావాలని భావిస్తోంది. కెప్టెన్‌ రోహిత్‌శర్మతోపాటు విరాట్‌ కోహ్లీ, చెతేశ్వర్‌ పుజారా, శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌తో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉంది. షమి, సిరాజ్‌, ఉమేశ్‌యాదవ్‌, అశ్విన్‌, జడేజాతో పాటు ఉనద్కట్‌, శార్దూల్‌ ఠాకూర్‌లతో కూడిన బౌలింగ్‌ దళం ప్రత్యర్థిని కట్టడియగల సామర్థ్యాన్ని కలిగివుంది. సాంకేతికంగా ప్రస్తుత ఆసీస్‌ జట్టును ఓడించగల సత్తా ఈ టీమ్‌కు ఉంది. అయితే, తటస్థ వేదికపై పరిస్థితుల్ని ఎవరు త్వరగా సద్వినియోగం చేసుకుంటే వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఆస్ట్రేలియాతో డబ్ల్యుటిసి ఫైనల్‌ ఆడటం తన కెరీర్‌లో పెద్ద మ్యాచ్‌లలో ఒకటని టీమిండియా స్పిన్నర్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ట్రోఫీ గెలిచి తీరతాం: రోహిత్‌, కమ్మిన్స్‌

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వేళ మంగళవారం ఇరు జట్ల కెప్టెన్లు ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. కెప్టెన్స్‌ ఫోటో ఈవెంట్‌లో పాల్గొన్న రో#హత్‌ శర్మ, ప్యాట్‌ కమ్మిన్స్‌లు పలు అభిప్రాయాలు వెల్లడించారు. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ మేస్‌తో ఆ ఇద్దరూ ఫోటో దిగారు. ఫైనల్‌ వరకు చేరేందుకు ఎంతో శ్రమించామని, ఇక మేస్‌ను అందుకోవడమే తమ లక్ష్యమని ఆసీస్‌ కెప్టెన్‌ కమ్మిన్స్‌ చెప్పుకొచ్చాడు. స్వదేశంలో టోర్నీలతోపాటు, విదేశీ టూర్లలోనూ సక్సెస్‌ సాధించామని కమ్మిన్స్‌ తెలిపాడు. కాగా, రో#హత్‌ శర్మ మాట్లాడుతూ, గత కొన్నాళ్ల నుంచి తమ జట్టు నిలకడగా క్రికెట్‌ ఆడుతోంది. టోర్నమెంట్‌ చాలా టఫ్‌గా సాగింది. గత రెండేళ్ల నుంచి నిలకడగా ఆడడం వల్లే ఈ దశకు చేరుకున్నాం. బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లో మా జట్టు పటిష్టంగా ఉంది. కీలక పోరులో మరోసారి అన్ని రంగాల్లో రాణించాల్సి ఉందని రో#హత్‌ చెప్పాడు. ఇరు జట్లకు ఓవల్‌ తటస్థ వేదికేనన్న హిట్‌మ్యాచ్‌, తటస్థ వేదికలపై ఆడడం తమకు అలవాటే అని పేర్కొన్నాడు.

భారత కెప్టెన్‌కు గాయం?

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడ్డాడు. అతడి ఎడమచేతి బొటన వేలికి చిన్నపాటి గాయమైంది. బ్యాటింగ్‌ చేస్తుండగా బంతి బొటన వేలికి బలంగా తాకింది. దాంతో కాసేపు నొప్పితో బాధపడ్డాడు. అతనికి వెంటనే భారత ఫిజియోలు వైద్య సహాయం అందించారు. చేతికి బ్యాండెజీలు వేసుకున్న తర్వాత రోహిత్‌ తిరిగి ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి గాయం తీవ్రమైనది కాదని అర్ధమవుతోంది. రోహిత్‌ గాయం గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇంగ్లాండ్‌లో రోహిత్‌కు మంచి రికార్డు ఉంది. అక్కడ ఆడిన 5 టెస్టుల్లో 402 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగబోతున్న ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై 2021లో సెంచరీ (127) కూడా చేశాడు. కాగా, రోహిత్‌ గాయంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కీలక ఫైనల్స్‌కు ముందు గాయం బ్యాటింగ్‌కు అంతరాయం కలిగించొద్దని ప్రార్థిస్తున్నారు.
కింగ్‌ కోహ్లీకి

రికార్డుల స్వాగతం!

  • విరాట్‌ కోహ్లీ ఇప్పటి వరకు 15 ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడాడు. సచిన్‌, ధోనీలు కూడా ఇన్నే మ్యాచ్‌లు ఆడారు. ఈ జాబితాలో యువరాజ్‌సింగ్‌ (17), రికీ పాంటింగ్‌ (18) ముందు వరుసలో ఉన్నారు. నేటి మ్యాచ్‌తో విరాట్‌ మూడవ స్థానానికి చేరుకుంటాడు.
  • ఐసీసీ నాకౌట్‌ స్టేజ్‌ మ్యాచ్‌లలో ప్రస్తుతం కోహ్లీ సాధించిన పరుగులు 620. సచిన్‌ (657), రికీ పాంటింగ్‌ (731) ని అధిగమించి ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌లలో కింగ్‌గా నిలిచే అవకాశం విరాట్‌ ముందుంది.
  • అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై 92 మ్యాచ్‌లలో కోహ్లీ 4945 పరుగులు చేశాడు. మరో 55 రన్స్‌ చేస్తే ఐదువేల మార్క్‌ చేరుకుంటాడు.
  • ఇంగ్లండ్‌లో అత్యధిక రన్స్‌ చేసిన ఇండియా బ్యాటర్‌ రికార్డు రాహుల్‌ ద్రవిడ్‌ పేరిట ఉంది. 46 మ్యాచ్‌లు ఆడిన ద్రవిడ్‌ 2645 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 15 అర్ద సెంచరీలు ఉన్నాయి. ద్రవిడ్‌ తర్వాత సచిన్‌ 2626 (43మ్యాచ్‌లు) రెండవ స్థానంలో ఉండగా, 2574 రన్స్‌తో కోహ్లీ మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 53 పరుగులు చేస్తే సచిన్‌ రికార్డును విరాట్‌ అధిగమిస్తాడు.
Advertisement

తాజా వార్తలు

Advertisement