Saturday, November 23, 2024

ఉప రాష్ట్ర‌ప‌తి రేసులో ఎవరెవరు ఉండబోతున్నారంటే..

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరు వినిపించినా, పార్టీ అధినాయకత్వం కొన్ని సమీకరణాల నేపథ్యంలో ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు తేదీలు ఖరారైన నేపథ్యంలో, వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతిగానైనా కొనసాగించేనా అన్న చర్చ మొదలైంది. ఉపరాష్ట్రపతి పదవి ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి చాలా కీలకమైనది. కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతిగా బరిలో దింపిన సమయంలో పార్టీ అధిష్టానం లెక్కలు వేరు. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఛైర్మన్‌గానూ వ్యవహరించాల్సి ఉంటుంది.

2017లో రాజ్యసభలో ఎన్డీయే కూటమికి తగినంత సంఖ్యాబలం లేదు. అప్పటికే ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు, సవరణ బిల్లులను రాజ్యసభలో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్య నాయుడు సభను సజావుగా నడిపిస్తారని అధినాయకత్వం భావించింది. హెడ్‌మాస్టర్‌లా వ్యవహరిస్తూ సభను దారిలోకి తీసుకొచ్చిన వెంకయ్య నాయుడు, పాలకవర్గం అంచనాలకు మించి పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాష్ట్రపతి పదవి దక్కకపోయినా, మరోసారి ఉపరాష్ట్రపతి పదవైనా దక్కుతుందని చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే, జాతీయ నాయకత్వం ఆలోచనలు, సమీకరణాలు మరోలా ఉన్నాయని కమలదళంలో కొన్ని వర్గాలు చెబుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా ఇప్పటి వరకు అత్యున్నత రాజ్యాంగ పదవిలో కూర్చోలేకపోయిన ఆదివాసీ-గిరిజన సామాజికవర్గానికి తాము తొలిసారి అవకాశం కల్పించామని చెప్పుకుంటూ ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించిన కమలనాథులు, ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఇదే తరహా సమీకరణాలను బేరీజు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలో ఉపరాష్ట్రపతి పదవిని సైతం బాగా వెనుకబడిన వర్గాలు లేదా అల్పసంఖ్యాక వర్గాలకు అప్పగించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

ఈ లెక్కల ప్రకారం దళితవర్గాలకు తామిస్తున్న ప్రాధాన్యత ఏమీ తగ్గలేదని చెప్పకోడానికి ఈసారి ఉపరాష్ట్రపతి పదవిని ఆ వర్గానికి కేటాయించవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ఆ వర్గానికి చెందిన సీనియర్ నేతల జాబితాను వడపోసి సిద్ధం చేశారని సమాచారం. చాలా దూరదృష్టితోనే కేంద్ర మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లోత్‌ను కర్నాటక గవర్నర్‌గా పంపారని, తద్వారా రాజ్యాంగ పదవుల్లోనూ అనుభవాన్ని పొందేలా చేశారని తెలుస్తోంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన ఆయన్ను ఆ సభాపతిగా కూర్చోబెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా దేశవ్యాప్తంగా సందేశాన్ని పంపించడంతో పాటు రాజ్యసభనూ నడిపించగల సమర్థతను గెహ్లోత్‌లో చూశారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరో విశ్లేషణ ప్రకారం ఒకవేళ దళిత సమీకరణాలు కాకుండా మరో సమీకరణాన్ని పరిగణలోకి తీసుకుంటే, ముస్లిం-మైనారిటీలకు అవకాశం కల్పించవచ్చని చర్చ జరుగుతోంది. నిజానికి ముస్లింలకు పదవి ఇవ్వడం ద్వారా దేశంలో ఆ వర్గం నుంచి బీజేపీకి ఓటుబ్యాంకు తరలివెళ్తుందన్న ఆశ ఏమాత్రం లేనప్పటికీ, నూపుర్ శర్మ వ్యాఖ్యల అనంతరం అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఒక సందేశం పంపించడం కోసం ఉపరాష్ట్రపతి పదవిని ముస్లిం వ్యక్తికి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు ముందువరుసలో ఉంది. ఆయన రాజ్యసభ పదవీకాలం పూర్తయినప్పటికీ మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు అవకాశం కల్పించలేదు. దీంతో ఆయన్ను రాజ్యాంగపదవి కోసమే పక్కనపెట్టారని విశ్లేషణలు వినిపించాయి. పైగా పార్టీకి విధేయంగా ఉండే నఖ్వీని ముందుపెట్టి గల్ఫ్, ఇస్లామిక్ దేశాలతో సంబంధాలను మరింత మెరుగుపర్చుకునే వీలుంటుందని లెక్కలు వేస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఒకవేళ ముస్లిం అంశం కూడా పరిగణలోకి తీసుకోకపోతే, బాగా వెనుకబడిన వర్గాలు (మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్) నుంచి ఎవరినైనా తెరపైకి తీసుకురావొచ్చని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వంటి ఓబీసీ వర్గాల వ్యక్తికి అవకాశం కల్పిస్తే రెండు రాజ్యాంగ ఉన్నత పదవుల్లో మహిళలకే అవకాశం కల్పించినట్టు మహిళా ఓటర్లలో బలమైన సందేశాన్ని పంపడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలకూ ప్రాధాన్యత కల్పించినట్టవుతుందనే చర్చ జరుగుతోంది. ఈ చర్యతో మహిళ, దక్షిణ భారతదేశం, ఓబీసీ వంటి మూడు సమీకరణాలకు పెద్దపీట వేసినట్టవుతుందని పార్టీ నేతలు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ సమీకరణాల మాటెలా ఉన్నా.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార కూటమికి పార్లమెంటు ఉభయ సభల్లో తిరుగులేని మెజారిటీ ఉంది. దీంతో ప్రతిపక్షాలు రాష్ట్రపతి ఎన్నికల తరహాలో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించుతాయా లేదా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement