భారతదేశానికి చెందిన నాలుగు దగ్గు మందులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అలెర్ట్ నోటీసులు జారీ చేసింది. ఇండియాకు చెందిన మైడెన్ ఫార్మాస్యుటికల్స్‌కు చెందిన నాలుగు దగ్గు మరియు జలుబు సిరప్‌లు గాంబియాకు చెందిన 66 మంది చిన్నారుల మృతికి సంబంధముందని డబ్ల్యుహెచ్‌ఓ అనుమానం వ్యక్తం చేసింది. ఈ సిరప్‌లు చిన్నారుల కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపటం వలన 66 మంది చిన్నారులు మరణించారని డబ్ల్యుహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అద్హానామ్ గ్హేబ్య్రేస్యుస్ వెల్లడించారు. ఈ సిరప్‌లపై దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను డబ్ల్యుహెచ్‌ఓ ఆదేశించింది. అవి ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్‌మలిన్ బేబీ కఫ్ సిరప్, మాకాఫ్ బేబీ సిరప్ కఫ్ సిరప్ మరియు మగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్‌లని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ సిరప్‌లలో డైఎథలైన్ గ్లైకోల్ మరియు ఎథలైన్ గ్లైకోల్ శాతం అత్యధికంగా ఉన్నట్లు డబ్ల్యుహెచ్‌ఓ అనుమానం వ్యక్తం చేసింది.
ఈ టాక్సిక్‌ల ప్రభావం వలన చిన్నారుల్లో పొట్టనొప్పి, వాంతులు, డయేరియా, మూత్ర విసర్జన చేయలేక పోవడం, తలనొప్పి, కిడ్నీ సమస్యల కారణంగా మరణించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా, ఈ సంస్థకు సిరప్‌లు ఎగుమతి చేయడానికి అనుమతి లేదని, కానీ, అక్రమమార్గాల ద్వారా ఆఫ్రికా తదితర దేశాలకు రవాణా చేస్తున్నట్లు భారత ప్రభుత్వం అనుమానిస్తోంది. విచారణలో ప్రమాదకర టాక్సిన్‌ల మోతాదు ఎక్కువ ఉందని రుజువైతే, కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.