కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్నది. పేద, బీద అనే భేదం లేకుండా అన్ని దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అయితే అభివృద్ధి చెందిన దేశాలు తమ దగ్గరున్న మెరుగైన వైద్య సదుపాయాలతో మహమ్మారిని కొంతవరకు వేగంగా కట్టడి చేయగులుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వ్యాక్సిన్‌ల వినియోగంలో ధనిక దేశాలే ముందున్నాయి. స్వయంగా డబ్ల్యూహెచ్‌వో గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలో ధనిక, ఎగువ మధ్యతరగతి దేశాల జనాభా 53 శాతం ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లో 83 శాతాన్ని ఆ దేశాలే వినియోగించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
కానీ పేద దేశాలు మాత్రం ఈ వైరస్‌ను సరైన రీతిలో కట్టడి చేయలేక విలవిల్లాడుతున్నాయి. పేద దేశాల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉందని పేర్కొంది. పేద, దిగువ మధ్యతరగతి దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 47 శాతం ఉందని, కానీ ఆయా దేశాల్లో వ్యాక్సిన్ వినియోగం కేవలం 17 శాతం మాత్రమే ఉన్నదని WHO వెల్లడించింది. ఈ మేరకు WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేస్ ఒక ప్రకటన చేశారు.