Saturday, November 23, 2024

TTD | శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం.. విడుదల చేసిన టీటీడీ చైర్మన్‌

తిరుమల, ప్రభన్యూస్‌: శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణట్రస్టు (శ్రీవాణి) నిధులపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డితో శ్వేతపత్రం విడుదల చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మెన్‌ మాట్లాడుతూ, టీటీడీ బోర్డు తీర్మానం నెం.388 ప్రకారం సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా పురాతన దేవాలయాల పునరుద్దరణ, కొత్త ఆలయాలు, చిన్న ఆలయాల (భజనమందిరాలు) నిర్మాణానికి తోడ్పాటును అందించే ప్రధాన లక్ష్యంతో 2018 ఆగస్టు 28 న శ్రీవాణి ట్రస్టు ఏర్పాటైందన్నారు. అదేవిధంగా 2019 సెప్టెంబర్‌ 23 న బోర్డు తీర్మానం 23 ప్రకారం శ్రీవాణికి రూ.10,000 విరాళం ఇచ్చిన దాతలకు ఒకసారి విఐపి బ్రేక్‌ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.

అప్పటి నుంచి ట్రస్టు వాస్తవ కార్యచరణ ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో ఆలయాల నిర్మాణానికి గాను టిటిడి చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమానికి నిధులు వెల్లువెత్తాయి. ఈ ఏడాది మే 31 వ తేది వరకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్లో భక్తులు శ్రీవారికి రూ.860 కోట్లకు పైగా విరాళాలు అందించారని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా 8.25 లక్షల మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారని, 176 పురాతన ఆలయాల పునరుద్దరణకు రూ.93 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఒక్కొక్కటి రూ. 10 లక్షల వ్యయంతో మొత్తం 2,273 ఆలయాల నిర్మాణానికి ఆమోదం తెలిపామని, వీటిలో 1953 ఆలయాలను ఏపిదేవాదాయశాఖ, 320 ఆలయాలను సమరసత సేవా ఫౌండేషన్‌ నిర్మిస్తాయని వివరించారు.

- Advertisement -

టీటీడీ పరిపాలన పూర్తి పారదర్శకంగా నడుస్తోందని, ఇందులో భాగంగా ఇప్పటికే టీటీడీ ఆస్తులు, ఫిక్సిడ్‌ డిపాజిట్లు, బంగారం డిపాజిట్ల పై శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. ప్రస్తుతం శ్రీవాణిట్రస్టు నిధుల వినియోగం పై శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు. శ్రీవాణి నిధుల వినియోగంపై సందేహాలను నివృత్తి చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని, నిధులు దుర్వినియోగం అవుతున్నాయని కొందరు స్వార్ద ప్రయోజనాల కోసం చేస్తున్న నిరాధార ఆరోపణలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

ఈ నిధులను పురాతన ఆలయాల పునరుద్దరణ, నూతన ఆలయాల నిర్మాణాలకు వినియోగిస్తామని తెలిపారు. అనంతరం ఈవో మాట్లాడుతూ శ్రీవాణి నిధుల వ్యవహారం పై కొందరు పీఠాధిపతులు, వీహెచ్‌పీ నేతలు తనను కలిసినప్పుడు అన్ని పత్రాలు, బ్యాంకు ఖాతాలు, బ్యాలెన్స్‌ మొత్తం వివరాలు చూపామన్నారు. ఈ వివరాల పై విశ్వహిందూ పరిషత్‌ సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు రాఘవులు కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఎవరైనా నిరాధార ఆరోపణలు చేసేముందు లక్షలాది మంది భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకోవాలని, ఇలాంటి వారి పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement