న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే కూటమికి ఘనమైన చరిత్రే ఉంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ కాంగ్రెస్‌కు లేకపోయినా, పలు
ప్రాంతీయ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసి దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చైర్‌పర్సన్‌గా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా యూపీఏ ప్రభుత్వం కొనసాగిన విషయం తెలిసిందే. ఈ కూటమికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కన్వీనర్‌గా వ్యవహరించారు.
అంతటి ఘనకీర్తి కల్గిన యూపీఏ కూటమి నేడు మనుగడలో లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమైన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. నియంతృత్వ పాలనపై ఎవరూ పోరాటం చేయడం లేదని, ప్రస్తుతం బలమైన ప్రత్యామ్నాయం అవసరమని విశ్వసిస్తున్నట్లు మమత పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా అన్నట్లు శరద్‌పవార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత నాయకత్వానికి బలమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుంచాల్సి ఉందని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీ అయినా ముందుకొస్తే స్వాగతిస్తామని పవార్ తెలిపారు.