Monday, November 18, 2024

పాడి రైతుల‌కు ప్రోత్సాహ‌మేది? ప్రైవేటు డెయిరీల ఇష్టారాజ్యం..

రాష్ట్రంలో పాడి రైతులకు ప్రోత్సాహాకం కరువైందా, పాడి గేదెలకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కూడా లేదా అంటే రైతుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్రం ఏర్పాటకు ముందు, తరువాత అన్నట్టు విజయ డెయిరీ అభివృద్ధి చెందిందంటూ చైర్మన్‌, అధికారులూ చెబుతున్నా.. రైతులకు మాత్రం సమయానికి నిధులు అందకపోగా, రైతులకు అందించాల్సిన ప్రోత్సాహక నగదు కూడా అందించలేకపోతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పాడి గేదెలు, ఆవులకు బీమా సౌకర్యం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. మరో వైపు 2019 డిసెంబర్‌ నుంచి 2022 ఫిబ్రవరి 10 వరకు రైతులకు సుమారు రూ.32 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉండగా, విజయకు పాలుపోసే కొంతమంది రైతులకు అసలు రాష్ట్రం ఏర్పాటైన నుంచి ఒక్క రూపాయి ఇన్సెంటివ్‌ అందలేదని వాపోతున్నారు. దీంతో ఇప్పటికైనా విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు సత్వరమే న్యాయం చేయాలంటూ వారు కోరుతున్నారు.

పాల ధర పెంచాలి..

రాష్ట్రంలో విజయ డెయిరీకి పాలుపోసే రైతులకు ప్రస్తుతం ఇస్తున్న ధరలు ఏమాత్రం ఆశాజనకంగా లేవని, వెంటనే ధరలను పెంచాలని విజయ డెయిరీ పరిరక్షణ సమితి డిమాండ్‌ చేస్తోంది. లీటర్‌ గేదె పాలకు వెన్న శాతం 5 వస్తే రూ.34.70పై, ఆవు పాలకు 3శాతం వస్తే రూ.36.45 పైసలు ఇస్తున్నారు. వెన్న శాతం 10 వచ్చిన గేదెపాలకు రూ.69.40, 4.9శాతం వచ్చిన ఆవుపాలకు రూ. 36.45 పైసలు ఇస్తున్నారు. ఈ ధరలు రైతు లకు గిట్టుబాటు కావడం లేదని దాణా నుంచి అన్నింటికి ధర పెరిగిన నేప థ్యంలో పాలకూ ధర పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుం టున్న పాలకు ఇస్తున్న ధరలను ఇవ్వాలని రైతులు అంటున్నారు.

ప్రైవేటు డెయిరీల ఇష్టారాజ్యం..

విజయ డెయిరీతో పాటు రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రైవేటు డెయిరీలు ధరల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నాయని పలువురు బీఎంసీ చైర్మన్‌ లు ఆంధ్రప్రభతో అన్నారు. ప్రభుత్వం వద్ద ప్రోత్సాహక నిధులు తీసుకుంటు న్న రెండు ప్రైవేటు డెయిరీలు కూడా విజయ డెయిరీ కంటే అదనం గా రూ.2ను ఎక్కువగా ఇస్తున్నాయని, వాస్తవంగా ప్రభుత్వం వద్ద ఇన్సెంటివ్‌ తీసుకున్న ప్రైవేటు డెయిరీలు విజయ డెయిరీ కంటే అదనంగా ధరలు ఇవ్వకూడదన్న నిబంధన ఉందని జనగామ జిల్లాకు చెందిన ఓ బీఎంసీ మెంబర్‌ అన్నారు.

- Advertisement -

బీమా లేని పశువులు..

తెలంగాణ ఏర్పడక ముందు పశువులకు అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్‌ సౌకర్యం రాష్ట్ర ఏర్పాటు తరువాత లేకుండా పోయింది. గతంలో రూ.640 చెల్లిస్తే రూ.45 వేలు ఇన్సూరెన్స్‌గా అందేవి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో బ్యాంక్‌ రుణాల ద్వారా తీసుకు న్న గేదెలకు మాత్రమే ఇన్సూరెన్స్‌ సౌకర్యం ఉండగా, ఇతర పశువు లకు బీమా లేదు. ఇటీవల జనగామ జిల్లా చిల్పూర్‌ మండలం కృష్జాజీగూడంలోని రమేష్‌ అనే రైతు రూ.2 లక్షల 10వేలతో రెండు ఆవులను కొనుగోలు చేయగా, ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్‌ లేకపోవడంతో ప్రైవేటుగా చేయించేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఈలోపే ఆ ఆవులను పాముకాటు వేయడంతో మరణించాయి. దీంతో నా పరిస్థితి ఏంటంటూ ఆ రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు.

సారధులు లేని డెయిరీ..

ప్రస్తుతం విజయ డెయిరీ సారధులు లేని శాఖగా మారింది. ఇప్పటి వరకు చైర్మన్‌గా ఉన్న లోక భూమారెడ్డి పదవీకాలం 2022 ఫిబ్రవరి 17కు పూర్తికాగా, గతేడాది సెప్టెంబర్‌ 11న ఎండీగా ఉన్న శ్రీనివాసరావును రిలీవ్‌ చేసింది. ప్రస్తుతం విజయ డెయిరీకి చైర్మన్‌, ఎండీ లేరు. దీంతో డెయిరీలో అధికారుల ఇష్టారాజ్యం నడుస్తుం దని రైతులు ఆరోపిస్తున్నారు. ఎండీని రిలీవ్‌ చేసి సుమారు 6నెలలు కావస్తుండగా ఇప్పటివరకు ఆ పోస్టులో ఎవరిని నియమించలేదు, మరోవైపు తాజాగా చైర్మన్‌ పదవీ పూర్తి కావడంతో ఎవరిని నియమిస్తారోనన్న చర్చ సాగుతోంది.

పాడి రైతునే చైర్మన్‌గా నియమించాలి..

విజయ డెయిరీకి ఇప్పటివరకు చైర్మన్లగా రాజకీయ నేతలనే నియమిస్తుండగా, ఇక నుంచైనా పాడి రైతులనే చైర్మన్‌గా నియమించాలని విజయ డెయిరీ పరిరక్షణ సమితి డిమాండ్‌ చేస్తోంది. రైతుల సమస్యలు తెలిసిన పాడి రైతునే చైర్మన్‌గా నియమించడంతో రైతులకు న్యాయం జరుగుతందని పరిరక్షణ సమితి అంటోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement