కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కరోనా కారణంగా చాలా మంది రోడ్డునపడ్డారని, అయినా వారి కోసం ఎలాంటి ఆర్థిక సాయం అందించలేదన్నారు. చాలా మంది ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. ప్రజలను, కార్మికులను, కరోనా బాధితులను ప్రధాని మోడీ విస్మరించారన్నారు. కరోనా బారినపడిన వారిని కాపాడటంతో ఆయుష్మాన్ భారత్ పూర్తిగా విఫలమైందన్నారు. ఉచిత వైద్యం అందిస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. డబ్బున్న వారు కరోనా బారినపడితే.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారని, అదే నిరుపేదలు చనిపోయారన్నారు. ఇలాంటి సమయంలో కూడా ఆయుష్మాన్ భారత్తో కనీస వైద్య సదుపాయం పొందలేకపోయారని విమర్శించారు. ఆర్థికంగా నష్టపోయిన చిన్న పరిశ్రమలను ఆదుకున్న దాఖలాల్లేవన్నారు.
పెరుగుతున్న నిత్యావసర ధరలు..
రోజురోజుకూ పెరుగుతున్న ధరల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులపై తాజా నివేదికలు ఇవే చెబుతున్నాయన్నారు. కరోనా సమయంలో పీఎం కేర్ నిధిని ఏర్పాటు చేశారని, కోట్లాది రూపాయల నిధి జమ అయ్యిందని, కానీ వాటిని కరోనా బాధితుల ప్రయోజనం కోసం ఉపయోగించడంలో మోడీ పూర్తిగా విఫలం అయ్యారని మండిపడ్డారు. దేశంలో రోజురోజుకూ నిరుద్యోగం పెరుగుతున్నదని, అయినా మోడీ ప్రభుతం మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చేతిలో చిల్లి గవలేక.. చేయడానికి ఉద్యోగం లేక.. చాలా మంది మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రోజురోజుకూ వీరి సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. సమాచార హక్కు చట్టం దరఖాస్తు కింద నేషనల్ హెల్త్ అథారిటీ ఇచ్చిన ఓ నివేదిక వెల్లడించిందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితుల్లో సుమారు 12 శాతం మందికి మాత్రమే ఆయుష్మాన్ భారత్ ఫలాలు అందాయన్నారు. కరోనా మరణాలకు ప్రభుత్వ వైఖరి, నిర్లక్ష్యమే కారణమని దుయ్యబట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..