న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ ఆరోపించారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత రాష్ట్రంలో బీజేపీకి కొత్త ఉత్సాహం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీని, నరేంద్ర మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ విస్తరిస్తున్న తీరును చూసి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని విమర్శించారు.
కేసీఆర్ మోదీపై చేసిన వ్యాఖ్యలను, ఆయన మాట్లాడిన భాషను ఖండిస్తున్నానన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సవాల్‌ను స్వాగతిస్తున్నామని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జరిగినా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుటుంబంపాలన కొనసాగుతోందన్న తరుణ్ చుగ్, ఆ ఒక్క కుటుంబమే అభివృద్ధి చెందిందని మండిపడ్డారు. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ అవినీతి తెలంగాణగా మార్చారని విమర్శించారు.
చందమామ మీద ఉమ్మి వేస్తే మన మీదే పడుతుందనే విషయం కేసీఆర్ గ్రహించాలని తరుణ్ చుగ్ హితవు పలికారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డీజిల్, పెట్రోల్ ధరలు తెలంగాణలో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు చమురు ధరలపై టాక్సులు తగ్గించిందని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్‌కి ప్రజలు బాయ్ బాయ్ చెప్పే రోజులు దగ్గరకు వచ్చాయని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.