Tuesday, November 26, 2024

Big story : ఖాళీల లెక్క తేలేదెన్నడు.. పోస్టులు వేసేదెప్పుడు?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఒకవైపు వివిధ శాఖల నుంచి ఖాళీ వివరాలు వచ్చి ఆర్థిక అనుమతులు పొంది వరుస నోటిఫికేషన్లు వెలువడుతుంటే విద్యాశాఖ టీచర్‌ పోస్టుల భర్తీపై ఇంకా గందరగోళమే నడుస్తోంది. టీచర్‌ పోస్టుల భర్తీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్తున్నా ఇంతవరకూ ఖాళీలపై ఇంకా సరైన స్పష్టత రాని పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని అధికారులే స్పష్టం చేస్తున్నారు. 317 జీవో అమల్లులో భాగంగా కొత్త జిల్లాలకు టీచర్ల కేటాయింపుల కారణంగా సర్దుబాటు ప్రక్రియ జరుగుతోందని, దాంతో జిల్లా పోస్టుల్లో తేడాలు ఉంటాయని ఇటీవల పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన పేర్కొనడం గమనార్హం. ఈ క్రమంలోనే మళ్లి ఖాళీల వివరాలను సేకరించే పనిలో విద్యాశాఖ అధికారులు పడ్డారు. టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ప్రకటన చేసి దాదాపు ఆరు నెలలు కావొస్తుంది. మరోవైపు టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌) ముగిసి సుమారు మూడు నెలలు కావొస్తుంది. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో? ఎన్ని పోస్టులు నింపాలో? అనే దానిపై గందరగోళం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని వివిధ శాఖల్లో మొత్తం 13,086 పోస్టులు ఉన్నట్లు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో టీచింగ్‌ పోస్టులు 11,150 కాగా, మిగిలినవి నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే వీటిలో ప్రధానంగా 9300 వరకు టీచర్‌ పోస్టులను మాత్రమే నింపుతారనే చర్చ జరుగుతోంది. ఇందులోనూ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు (ఎస్‌ఏ) 2179, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు (ఎస్జీటీ) 6300 కాగా, లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టులు 669, పీఈటీ పోస్టులు 162, మ్యూజిక్‌ టీచర్‌, ఆర్ట్‌క్రాఫ్ట్‌ పోస్టులు 441 వరకు ఉన్నాయి. అయితే ఈ పోస్టులన్నీ భర్తీ చేస్తామని గత మార్చిలో జరిగిన అసెంబ్లి సమావేశంలో ప్రకటించినా కానీ ఇంత వరకు దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. అయితే నోటిఫికేషన్‌ వెలువడే సమయమప్పటికీ ఈ ఖాళీల లెక్కలు మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు మాత్రం టీచర్‌ పోస్టుల ఖాళీలు 15వేల నుంచి 20 వేల వరకు ఉన్నాయని పలు టీచర్‌ సంఘాలు పేర్కొంటున్నాయి.

సర్దుబాటుతోనే సరి!…

ప్రస్తుతం అధికారులు… విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో టీచర్లను సర్దుబాటు చేస్తున్నారు. అంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నచోట పనిచేసే టీచర్లను.. సమీపంలోని విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి, టీచర్ల కొరత ఉండే పాఠశాలల్లో బోధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2017లో తొలిసారిగా టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టీఆర్టీ)ను టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టి 8,792 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేశారు. ప్రస్తుతం జిల్లాల సంఖ్య 10 నుంచి 33కు పెరగడంతో ప్రభుత్వం ప్రకటించిన పోస్టులను భర్తీ చేస్తారా? లేక పోస్టులను సంఖ్యను ఇంకా

పెెంచుతారా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు డీఎస్సీ నిర్వహించేందుకు అధికారులు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. టీఆర్టీ ద్వారానే టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. టెట్‌ నిర్వహించి దాదాపు మూడు నెలలు కావొస్తున్నా టీచర్‌ పోస్టుల భర్తీ ప్రకటన వెలువడకపోవడంతో దాదాపు 5 లక్షల మంది టెట్‌ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీని వేయాలని డిమాండ్‌ కూడా చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement