Saturday, November 23, 2024

కొత్త ప్రభుత్వ వైద్య కాలేజీలకు బోధనా సిబ్బంది ఎప్పుడు..

కొత్తగా ప్రకటించిన మెడికల్‌ కాలేజీల్లో బోధనా సిబ్బంది భర్తీపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. కొత్త ప్రభుత్వ వైద్య కాలేజీల్లో బోధనా సిబ్బంది కొరతపై మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నెల రోజుల క్రితం ఎంసీఐ బృందం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన నాగర్‌కర్నూలు, వనపర్తి, మంచిర్యాల, రామగుండం, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి వైద్య కళాశాలలను తనిఖీ చేసింది. ప్రధానంగా బోధనా సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించ కపోవటం, పలు మెడికల్‌ డిపార్ట్‌మెంట్ల ఏర్పాటులో తాత్సారం, భవనాల నిర్మాణాలు అంసపూర్తిగా ఉండటం, ల్యాబ్‌ల ఏర్పాటు తదితర సదుపాయాల కల్పన ఇంకా పూర్తికాకపోవటంపై అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. ఈ ఏడాది జూన్‌ నుంచి ప్రకటించిన 7 కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నందున అన్ని విభాగాల్లో బోధనా సిబ్బంది నియామకాలను పూర్తి చేయాలని డీఎంఈని ఆదేశించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో కొత్త మెడికల్‌ కాలేజీల్లో బోధనా సిబ్బంది ఖాళీల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. వైద్య కళాశాలల ఏర్పాటు ప్రక్రియలో గైనకాలజీ, అనాటమీ, జనరల్‌ మెడిసిన్‌, వైరాలజీ తదితర 14 డిపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక్కో డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయాలంటే 72 బెడ్లతోపాటు ఒక ప్రొఫెసర్‌, ఒక అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అవసరం ఉంటుందని ఉన్నతాధికారులు చెెబుతున్నారు. ఒక్కో మెడికల్‌ కాలేజీ కోసం ఆరుగురు ప్రొఫెసర్లు, 17మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు , 31 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కావాల్సి ఉంటుంది. మొత్తంగా 377 మంది బోధనా సిబ్బంది ప్రకటించిన 7 మెడికల్‌ కాలేజీల్లో బోధన కోసం సమకూర్చుకోవాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే పలు చోట్ల నుంచి సరెండర్‌ ద్వారా 115 మందిని సమకూర్చుకోగా మిగతా ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది.

అదేసమయంలో రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 9 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు 1300 వరకు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్లు 300, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 1900, కొత్త మెడికల్‌ కాలేజీల్లో మరో 200 మేర కలుపుకుంటే దాదాపు 2600 దాకా బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌), తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ)లోని స్పెషలిస్టు వైద్యులనువైద్య విద్య విభాగంలోకి అబసార్బ్‌ చేస్తున్నారు. మరోవైపు కాంట్రాక్టు పద్దతిన 645 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాల కోసం వారం క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్‌ వెలువరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement