దాదాపు 7 గంటలపాటు ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా సేవలు నిలిచిపోవడంతో ఈ మూడింటి మాతృసంస్థ ఫేస్ బుక్ స్పందించింది. ఈ అంతరాయానికి చింతిస్తున్నామంటూ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఓ పోస్ట్ చేశాడు. మీకు ఇష్టమైన వారితో సన్నిహితంగా ఉండేందుకు ఫేస్బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ఎంతగా ఉపయోగపడుతున్నాయో తమకు తెలుసని.. ప్రస్తుతం అంతా ఓకే అని చెప్పాడు. యూజర్లు అందరూ తమను క్షమించాలని జుకర్ బర్గ్ కోరాడు.
సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల దాకా ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో ఈ మూడు సేవలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరోవైపు 7 గంటల అంతరాయానికి జుకర్ బర్గ్ భారీగానే మూల్యం చెల్లించుకున్నాడు. సుమారు 7 బిలియన్ల డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.52 వేల కోట్లకు పైగా నష్టం వచ్చినట్లుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఫేస్ బుక్ వచ్చినప్పటి నుంచి ఇంత సమయంలో సర్వీసులు నిలిచిపోవడం ఇదే తొలిసారి.