కంటి వెలుగు పథకం ఓట్ల కోసం తెచ్చింది కాదని, దీని వెనుక ఎంతో పరమార్థం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘చక్కటి పరిపాలన భవనాన్ని మంజూరు చేసుకోవడమే కాకుండా పూర్తి చేసుకొని.. ప్రారంభోత్సవం చేసుకున్నందుకు అభినందనలు తెలుపుతున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ఆలోచన చేసి తెచ్చిందేనని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సంస్కరణ అనేది అంతం కాదు.. కొనసాగుతూనే ఉంటుందని తెలపారు. అందరి సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ‘‘ఏడేళ్ల క్రితం 60వేల కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేది. ఇప్పుడు 3లక్షల కోట్లకుపైగా బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం. సంక్షేమ కార్యక్రమాల్లో మనకు సాటి ఎవరూ లేరు. గతంలో భయంకరమైన కరెంట్ బాధలు ఉండేవి.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ తెలంగాణ కోరుకున్నామో ఆ బాటలో ఉన్నాం. మనం ఉన్నప్పుడు ఏం చేశామన్నదే ముఖ్యం.. జీవితానికి అదే పెద్ద పెట్టుబడి, సంతృప్తి. గురుకులాలను 3, 4 రెట్లు పెంచుతాం. కంటివెలుగు ఆషామాషీగా తెచ్చిన కార్యక్రమం కాదు’’ అని వివరించారు.
ఏ కార్యక్రమమైనా ప్రజలకు మేలు జరగాలి..
‘ఏరకమైన కార్యక్రమం తీసుకున్నా మానవీయ దృక్పథంతో.. ప్రజలకు మేలు జరుగాలి. ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి రూపాయి వారి సేవకు వెళ్లాలని చెప్పి మేధోమథనం చేసి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. సంస్కరణలు అనేది అన్ ఎండింగ్ ప్రాసెస్. మానవజాతి భూమిపై ఉన్నన్ని రోజులు సంస్కరణలు కొనసాగుతాయి, దానికి అంతం ఉండదు. ఎప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మేధోమధనం చేసి కొత్త సంస్కరణలు అమలులోకి తీసుకువస్తారు. ఎప్పటికప్పుడు మేధో మధనాన్ని, ఆలోచనలను కలబోసుకోని అందరు కలిసి ఆత్మీయంగా, ప్రేమతో పని చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమంత్రో, ఒక మంత్రో, ఎమ్మెల్యేనో, కలెక్టరో అనుకుంటే ఏమీ జరుగదు. అందరు కలిసి టీమ్ వర్క్ చేసే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రం. ఏడేళ్ల కిందట మన బడ్జెట్ ఎందో తెలియదు, ఎకనామిక్ ట్రెండ్ ఏంటో తెలియదు. మనకు శాపాలు పెట్టిన వారున్నారు.. దీవెనలు పెట్టిన వారున్నారు. ఇప్పుడున్నది అందరి సమష్టి కృషి ఫలితం. పాలమూరు జిల్లా అద్భుతంగా రూపాంతరం చెందుతుంది. ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది’ అన్నారు.