Friday, November 22, 2024

యూనివర్సిటీ పేరు మార్చి సాధించేది ఏముంది.. ఏమైన వసతులు పెరుగుతయా?

ఎన్టీఆర్​ వైద్య విశ్వవిద్యాలయం పేరులో మార్పు చేయడం ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నారో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. ఎన్టీర్​ బదులుగా వైఎస్సార్​ అని పెడితే విశ్వ విద్యాలయంలో కానీ, రాష్ట్రంలో కానీ వైద్య వసతులు మెరుగైపోతాయా అని ప్రశ్నించారు. ఏపీలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గట్టుగా లేవన్నది నిజమని, ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ తగినన్ని పడకలు లేవన్నారు. అంతేకాకుండా సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, కావల్సిన మెడిసిన్స్​ ఉండడం లేదన్నారు.

కొవిడ్​ సమయంలో మాస్కులు అడిగినందుకు డాక్టర్​ సుధాకర్​ని వేధించడంతోపాటు మానసిక వ్యధకి గురిచేసి, అతని మరణానికి కారకులయ్యారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. డెవలప్​ చేయాల్సిన విషయాలను వదిలేసి విశ్వవిద్యాలయం పేరు మార్చడం వల్ల ఏం సాధిస్తారో చెప్పాలని పవన్​ కల్యాణ్​ డిమాండ్​ చేశారు.

ఒకవేళ పేరు మార్చాలి అనుకుంటే.. విశాఖలో కింగ్​జార్జ్​ ఆస్పత్రి పేరు మార్చుకోవచ్చు కదా.. ఆ పేరు బ్రిటిష్ పాలనలో పెట్టారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఇంగ్లిష్ పాలకులు పేర్లు ఇంకా ఉంచడం దేనికి, కేజీహెచ్​ పేరు మార్చి వైద్య ప్రముఖులలో ఒకరి పేరు పెట్టండి అని పవన్​ కల్యాణ్​ సూచించారు. అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్తల్లో ఒకరైన దివంగత యల్లాప్రగడ సుబ్బారావు పేరు ఈ ప్రభుత్వ పాలకులకు తెలుసా అని ప్రశ్నించారు. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే అట్లాంటి మహనీయుల పేరు యూనివర్సిటీకి పెట్టాలనే ఆలోచన చేసేవారన్నారు. ఇంట్లో వాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టే ముందు.. ప్రజల కోసం జీవితాలను దారపోసిన మహనీయుల గురించి తెలుసుకుంటే మంచిదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement