Wednesday, November 20, 2024

Delhi | బండారు మాటల్లో తప్పేముంది? ఆయన వెంటే పార్టీ ఉంది : చింతమనేని

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి బండారు సత్యనారాయణను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి వేధిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఢిల్లీలో ఉన్న ఆయన మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ ఇలా అన్ని వర్గాలపై దాడులు చేస్తూ, వాళ్లను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్సీ సునీత ఇలా మాట్లాడడం దారుణమని, నిండు సభలో తమ నేత కుటుంబాల గురించి ఎలా అవమానించి మాట్లాడారో తెలియదా అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులను సైతం రాజకీయాల్లోకి లాగి అవమానించేలా మాట్లాడింది వైఎస్సార్సీపీయేనని అన్నారు. బండారు సత్యనారాయణ చెప్పినదాంట్లో తప్పేముందని ఆయన ఎదురు ప్రశ్నించారు.

.తెలుగుదేశం పార్టీ ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తోందని ప్రకటించారు. ఆయన మాటలను కూడా సమర్థిస్తోందని వెల్లడించారు. గ్రామస్థాయి నుంచి మాజీ ముఖ్యమంత్రి వరకు అందరినీ అరెస్టు చేసి జైళ్లకు పంపుతున్నారని విమర్శించారు. పోలీసులను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలపై చింతమనేని మండిపడ్డారు. ముందు సభలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకుని, ఆ తర్వాత బండారు సత్యనారాయణ గురించి ఆలోచించమని హితవు పలికారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement