కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వ్యాప్తి చెందుతున్న క్రమంలో నుమాయిష్‌కు సీఎం కేసీఆర్ అనుమతించడం ఏమిటని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం వల్ల వైరస్ సులభంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నూతన సంవత్సర వేడుకలపై అనేక ఆంక్షలు విధిస్తుంటే, తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గమైన గోషామహల్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఈ ఎగ్జిబిషన్‌కు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని, దీంతో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాట్లను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)ను జనవరి 1వ తేదీన ప్రారంభించడానికి ఎగ్జిబిషన్ సొసైటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, ఫైర్ శాఖ అనుమతులు లభించాయి. గవర్నర్ చేతుల మీదుగా నుమాయిస్‌ను ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది ఎగ్జిబిషన్‌లో స్టాళ్ల సంఖ్య భారీగా తగ్గింది. ప్రతియేటా 2,200 స్టాళ్లను ఏర్పాటు చేసేవారు. ఈసారి 700 స్టాళ్లను తగ్గించినట్లు సొసైటీ తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital