న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గత కొద్ది రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఏం చేస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఓ సాధారణ వ్యక్తి ఎక్కడికెళ్లినా ఎవరికీ అవసరం లేదని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధానిలో ఏం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పొన్నం అన్నారు. ప్రజలకు కనిపించకుండా ఆయన రహస్యంగా ఏదో చేస్తున్నట్టు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయిన కుటుంబాన్ని కాపాడుకోడానికి ఆయన ఢిల్లీకి వచ్చినట్టుగా కనిపిస్తోందని అన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే కేసీఆర్ కుటుంబ సన్నిహితులు అరెస్ట్ అయ్యారని, కూతురు కవిత చుట్టూ కేసులు బిగుసుకుంటున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో బేరసారాలు సాగిస్తున్నట్టుగా సందేహాలు కల్గుతున్నాయని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకు బీఆర్ఎస్ పేరుతో, కాంగ్రెసేతర ఫ్రంట్ పేరుతో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని, తద్వారా పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నారని సూత్రీకరించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చిన తర్వాత తెలంగాణలో ఆ పార్టీ అస్థిత్వాన్ని కోల్పోయిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. జాతీయస్థాయిలో పార్టీని విస్తరించడానికి ఆ పార్టీ నేతలు కొందరు చెబుతున్నా.. ఢిల్లీలో అలాంటి అలికిడి ఏదీ లేదని అన్నారు. ఉంటే అంత రహస్యంగా దాచిపెట్టాల్సిన పనేముందని ప్రశ్నించారు. పోనీ రాష్ట్రాభివృద్ధి కోసమే ఢిల్లీ వచ్చినట్టయితే, సీఎం ఈ వారం రోజుల్లో ఎవరెవరిని కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం అంతా మునుగోడు ఉపఎన్నికల్లో ఉందని, సీఎం ఢిల్లీలో కూర్చుని పాలన గాలికొదిలేశారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, చీఫ్ సెక్రటరీ సైతం రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.