భారత్ నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ డ్రామాలు మెల్లగా బయటపడుతున్నాయి. ఆంటిగ్వా నుంచి తప్పించుకోవడానికి అతడు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తాజాగా వెల్లడైంది. ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ తనను కచ్చితంగా ఇండియాకు అప్పగిస్తారని భావించిన తర్వాతే చోక్సీ ఇలా కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తేలింది. అతని ఫ్రెండ్ అయిన గొవిన్ అనే వ్యక్తి ఈ డ్రామాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆంటిగ్వా నుంచి క్యూబాలోని సేఫ్ హౌజ్‌కు అతన్ని తరలించే క్రమంలో డొమినికాలో అడ్డంగా దొరికిపోయి ఊచలు లెక్కబెడుతున్నాడు.
ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేయడంతో ఆంటిగ్వా నుంచి లీగల్‌గా బయటపడటం అసాధ్యమని భావించిన తర్వాత చోక్సీ ఇలా అడ్డదారిలో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కరీబియన్ దీవుల్లో ఆంటిగ్వా కాకుండా మరో దేశంలో కూడా చోక్సీకి పౌరసత్వం ఉన్నట్లు అతని ఫ్రెండ్ గొవిన్ చెప్పాడు. చోక్సీ కిడ్నాప్ అంతా ఉత్త డ్రామా అని ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది.