Saturday, November 16, 2024

ప్రమాదంలో ఉన్నది ప్రజాస్వామ్యం కాదు కాంగ్రెస్, సభ్యత్వం కోల్పోవడం ఇదే తొలిసారి కాదు : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాహుల్ గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ ప్రపంచానికి ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ రాహుల్ కుటుంబం, కాంగ్రెస్‌తో పాటు వారికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలు చేస్తున్న రాద్ధాంతం అర్థరహితమని కొట్టిపారేశారు. ప్రమాదంలో పడిందని ప్రజాస్వామ్యం కాదని కాంగ్రెస్ పార్టీయే తన విధానాలతో ప్రమాదంలో పడిపోతోందని వ్యాఖ్యానించారు. మంగళవారం పార్లమెంటు ఆవరణలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పుతో పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు తమ సభ్యత్వాన్ని కోల్పోవడం ఇదే మొదటిది కాదని, ఇటీవల లక్షద్వీప్‌కు చెందిన ఎండీ ఫైజల్, అంతకుముందు తమిళనాడు సీఎం జయలలిత వంటి ఎందరో కోర్టు తీర్పుల కారణంగా సభ్యత్వానికి దూరమైన విషయాన్ని గుర్తు చేశారు.

- Advertisement -

తన మాట కాదన్నందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ 50 సార్లు, ఆ ఒక్క కుటుంబమే 76 సార్లు ఆర్టికల్ 356ని (రాష్ట్రపతి పాలన) ప్రయోగించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఇందిరాగాంధీ అలహాబాద్ కోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకించి ఎమర్జెన్సీ విధించిన విషయాన్ని రాహుల్ గుర్తు తెచ్చుకుంటే బాగుంటుందన్నారు. స్వయంగా రాహులే కేబినెట్ చేసిన ఆర్డినెన్స్‌ను మీడియా ముందు చించేయడం రాజ్యాంగబద్ధమా? ప్రజాస్వామ్య బద్ధమా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ రాజకీయ అపరిపక్వతతో నోటిదురుసు వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాటిని సమర్థించుకోవడం హాస్యాస్పదమన్నారు.

రాహుల్‌కు మద్దతు పలుకుతున్న పార్టీలు వారి రాష్ట్రాల్లో ఎంతవరకు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నారో చూసుకోవాలని సూచించారు. గురివింద గింజ నీతులు చెప్పడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. 2013 నుంచి దేశవ్యాప్తంగా అనర్హతకు గురైన ఎంపీలు/ఎమ్మెల్యేల జాబితాను కిషన్ రెడ్డి ఈ సందర్భంగా విడుదల చేశారు. కేవలం రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం కోర్టు తీర్పుతో రద్దైనందుకు యావత్ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిందనడాన్ని ఆయా పార్టీల విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement