Saturday, November 23, 2024

తిట్లే బలమనుకుంటే ఎట్లా, దేశానికి, తెలంగాణకు ఏం చేశావు.. ప్రధానిపై మంత్రి హరీష్‌ సెటైర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ చేసిన విమర్శలపై టీఆర్‌ఎస్‌ ఎదురుదాడి కొనసాగిస్తోంది. మంత్రులు హరీష్‌రావు, గంగల కమలాకర్‌ ప్రధాని విమర్శలను తమదైన శైలిలో తిప్పికొట్టారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్కన బేరీజు వేస్తూ అవే తన బలమని ప్రధాని మోడీ అనుకుంటున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. ఈ విషయమై ఆదివారం తన అధికారిక ట్విట్టర్‌లో ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు.

”ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్‌ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోడీ జీ… దేశానికి, తెలంగాణకు ఏం చేశావని టీఆర్‌ఎస్‌ అడిగితే తిట్ల పేరిట పలయాన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోడీ జీ” అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

- Advertisement -

పన్నులు తెలంగాణవి… సంపద గుజరాత్‌కా..?: మంత్రి గంగుల

ఢిల్లి పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణ అభివృద్ధి ఆగదని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఎంత మభ్యపెట్టినా తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతం కాని వారి పాలనను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యటనలో ఓ ప్రతిపక్ష నేతగా ప్రధాని మోడీ మాట్లాడడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందలేదని, ఇదేనా బీజేపీ సంస్కృతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు ప్రకటిస్తారని అనుకుంటే కేవలం మోడీ రాజకీయాలే మాట్లాడారని ఎద్దేవా చేశారు. దేశ సంపదను అన్ని రాష్ట్రాలకు సమానంగా పంచాలని డిమాండ్‌ చేశారు. మెజారిటీ పన్నులు కట్టేది తెలంగాణ ప్రజలు అయితే సంపదను తరలించేది గుజరాత్‌కా..? అని ప్రశ్నించారు. పాదయాత్రల పేరుతో కొందరు.. కోతి వేషాలతో కేఏపాల్‌ లాంటి వారు తెలంగాణకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదేవిధంగా… విప్‌ బాల్క సుమన్‌ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందన్న అక్కసుతో ప్రధాని మోడీ సీఎం కేసీఆర్‌పై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండంలో అసత్య ఆరోపణలు చేసి రాష్ట్ర ప్రజల మనోభావాలను ప్రధాని దెబ్బతీశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలపై అంత ప్రేమే ఉంటే రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని బొగ్గు పరిశ్రమలతోపాటు సింగరేణిలోని బొగ్గు బ్లాక్‌లను వేలం వేయాలన్న ఆలోచన కేంద్రానికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement