Thursday, November 21, 2024

గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం ఏమైంది? : సత్యకుమార్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గండకోట ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామన్న పరిహారం ఏమైందో చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ ప్రశ్నించారు. శుక్రవారం ఢిల్లీలోని ఎం.ఎస్ ఫ్లాట్స్‌లో బండి సంజయ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై చర్చ జరుగుతోందని, రూ. 8 లక్షల కోట్ల మేర రాష్ట్రంపై రుణభారం ఉందని నిపుణులు చెబుతున్నారని సత్యకుమార్ అన్నారు. దేశాన్ని, రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని, పైగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారని వైఎస్సార్సీపీ నేతలపై మండిపడ్డారు. వైఎస్సార్సీపీపీ నేత విజయసాయి రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని, అప్పు ఎలా పెరిగిందో సమాధానం చెప్పలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. రూ. 10 విలువ చేసే భారతి సిమెంట్స్ షేర్ విలువను రూ. 20 వేలకు తీసుకెళ్లిన విజయసాయి రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ అప్పు ఎలా పెరిగిందో తెలియదా అని ప్రశ్నించారు.

చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన విజయసాయి రెడ్డికి అన్నీ తెలుసునని వ్యాఖ్యానించారు. కేంద్ర పథకాలకు వైఎస్సార్ కానుక, జగనన్న కానుక అని పెట్టుకున్నారని ఆరోపించారు. విభజన అనంతరం ఏపీలో ఒకే ఒక్క కేంద్ర విద్యా సంస్థ ఉండగా, ఇప్పుడు 25 కేంద్ర సంస్థలను మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం నిధిలిచ్చిందని గుర్తుచేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీల ఆస్తులు పెరిగాయని, కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా తిరోగమనంలో నడుస్తోందని సత్యకుమార్ అన్నారు. ఈ మూడేళ్లలో సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ మార్క్ సంక్షేమం, జగన్ మార్క్ సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సత్యకుమార్ సవాల్ విసిరారు. డబ్బులు ముద్రించేది కేంద్ర ప్రభుత్వమని జగన్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని అన్నారు. అమరావతిలో కేంద్ర సంస్థలకు కేటాయించిన భూములకు రోడ్లు, విద్యుత్తు సదుపాయం తదితర మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని సత్యకుమార్ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement