Friday, October 18, 2024

TG | ఆ మంత్రి ఇంటిపై ఈడీ దాడి కేసు ఏమైంది : కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులపై నిరంతరం ఈడీ దాడులు జరుగుతున్నా వివరాలు బయటకురాకుండా కాంగ్రెస్‌తో బీజేపీ సహకరిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌, బీజేపీ బంధం రోజురోజుకు బలపడుతుండటంతో కాంగ్రెస్‌ అవినీతిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దాచిపెడుతున్నదని ఆయన ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకులను ఈడీ నుంచి కాపాడుతున్న పెద్దన్న ఎవరని కేటీఆర్‌ నిలదీశారు. ఫిక్షన్‌ కంటే వాస్తవం వింతగా ఉంటుందని ఆయన ఉదహరించారు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తుంటే దాన్ని నమ్మక తప్పడం లేదని కేటీఆర్‌ అన్నారు. అందుకు సంబంధించిన రెండు ఘటనలను కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా వివరించారు.

తెలంగాణలో ఒక సంపన్నమైన కాంగ్రెస్‌ మంత్రి నివాసంలో రెండు వారాల కిందట ఈడీ దాడి చేసిందని గుర్తుచేశారు. ఆ దాడిలో వందల కోట్ల నగదు దొరికిందని కథనాలు వస్తున్నాయని తెలిపారు. అయితే ఇప్పటికీ కాంగ్రెస్‌, బీజేపీ, ఈడీ నుంచి దానిపై నోరు మెదపలేదని దుయ్యబట్టారు. ఎలాంటి వివరాలు బయటకు పొక్కకుండా ఈడీ, బీజేపీ, కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని ఆరోపించారు.

కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం ద్వారా వచ్చిన 40 కోట్ల అక్రమ ధనాన్ని పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌ ఉపయో గించిందని ఈడీ వెల్లడించిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులు, విచారణ ఎందుకు జరగలేదని కేటీఆర్‌ ఉదహరించారు. ఈ సంఘటనల ఆధారంగా పరిశీలిస్తే ఈడీ నుంచి తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకులను రక్షిస్తున్న పెద్ద అన్న ఎవరై ఉంటారని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement