Tuesday, November 26, 2024

బీజేపీ, టీఆర్ఎస్ తోడుదొంగలు.. ఐటీఐఆర్, వరదసాయంపై సీఎం కేసీఆర్ ఏం చేశారు? : పొన్నాల లక్ష్మయ్య

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ పర్యటన చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు రాష్ట్రంలో సంభవించిన వరదలపై కేంద్ర ప్రభుత్వం సహాయం కోరుతారని ఆశించానని, కానీ ఎందుకొచ్చారో తెలియదని పీసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆదివారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను 8 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం తిరస్కరిస్తే సీఎం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ రెండూ తోడుదొంగలని దుయ్యబట్టారు. అసలు ఐటీఐఆర్ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు తెలుసా అని ప్రశ్నించారు. మొదటి దశలో రూ. 2,100 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించి, 20 ఏళ్లలో రూ. 13,000 కోట్లు ఖర్చు చేసేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని తెలిపారు. మొత్తంగా 50 వేల ఎకరాల్లో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఐటీ పార్కుగా నిలిచేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఇంత భారీ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆమోదింపజేస్తే.. ఇప్పుడు దాన్ని నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు అమలై ఉంటే 15 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉపాధి, 55 లక్షలకు పైగా పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉండేదని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మొత్తంగా 70 లక్షల ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ ఎనిమిదేళ్లలో ఏడాదికి రూ. 2,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినా ఈపాటి ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో యానిమేషన్ గేమింగ్ పార్క్ కోసం రూ. 450 కోట్లతో పునాది వేస్తే, ఈ 8 సంవత్సరాల్లో అతీగతీ లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇది పూర్తయితే 15 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 40 వేల మందికి పరోక్ష ఉపాధి లభించేదని తెలిపారు.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందా అంటే అదీ లేదని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉపయోగమే లేదని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ. 45వేల కోట్లు బూడిదలో పోశారని విమర్శించారు. ఈసారి మోదీ, కేసీఆర్ లకు ప్రజలు బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement