Tuesday, November 19, 2024

Delhi | తెలంగాణ ఇచ్చిన ప్రతిపాదనలేంటి?.. ఇంత మంచి బడ్జెట్‌పై విమర్శలేల : బండి సంజయ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సమాజంలోని అన్ని వర్గాలను మెప్పించిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శించడం కోసమే విమర్శలు చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై సహచర ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, రాష్ట్ర నేత సంగప్పతో కలిసి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, బడ్జెట్‌కు వివిధ వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని, ప్రతిపక్షాలు విమర్శించేందుకు సైతం తావులేకుండా ఉందని అన్నారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశాన్ని మరింత వృద్ధిపథంలోకి తీసుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అందరూ ఇది ఎన్నికల బడ్జెట్ అనుకున్నారని, కానీ చెప్పేదే చేయడం, చేసేదే చెప్పడం ప్రధాని మోదీ లక్షణం అని వ్యాఖ్యానించారు. అమృతకాలంలో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగానే ఈ బడ్జెట్ ఉందని, సప్తరుషుల మాదిరి 7 ప్రాధాన్య రంగాలను గుర్తించామని తెలిపారు. చిట్టచివరి వ్యక్తి వరకు ప్రయోజనాలు అందేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని తెలిపారు. మోదీ ప్రధాని కాకముందు వరకు భారత్ ఆర్థికంగా ప్రపంచంలో 10వ స్థానంలో ఉంటే, మోదీ చేపట్టిన చర్యలతో భారత్ నేడు 5వ స్థానంలో నిలిచిందని కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందడమే అసలైన అభివృద్ధి అన్నది మోదీ విధానమని తెలిపారు. స్టార్టప్ రంగంలో ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశంగా భారత్ ఉందని, డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోందని బండి సంజయ్ అన్నారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్, ప్రతి ఇంటికీ తాగునీటి పైప్ లైన్ కనెక్షన్లు, ఏకలవ్య పాఠశాలలకు బోధన సిబ్బంది భర్తీ.. ఇలా ఈ బడ్జెట్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయని తెలిపారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు 66 శాతం అధిక నిధులు కేటాయించినట్టు వెల్లడించారు. రైల్వే రంగం అభివృద్ధికి రూ. 2.4 లక్షల కోట్లు కేటాయించామని, గత 9 ఏళ్ల బడ్జెట్‌తో పోల్చి చూస్తే 9 రెట్లు బడ్జెట్ పెరిగిందని తెలిపారు.

- Advertisement -

అప్పర్ భద్ర ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించడంపై ప్రశ్నించగా.. కర్ణాటకలో ఆ ప్రాంతం కరవు ప్రాంతమని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని, వాటికే కేంద్రం ఆమోదం తెలిపిందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణకు ఇవ్వలేదు అనే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమేం ప్రతిపాదనలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక బడ్జెట్ అన్న ఆరోపణలను ఖండిస్తూ.. ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నది ఎవరని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా ఎరువుల ముడి సరకు ధరలు పెరిగినా సరే ఆ భారం రైతులపై పడకుండా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని వెల్లడించారు.

రాష్ట్రానికి విద్యా సంస్థల కేటాయింపు జరగలేదన్న విమర్శకు బదులిస్తూ.. రాష్ట్రంలో ఉన్న త్రిపుల్ ఐటీని సరిగా నిర్వహింటచడం చేతకావడం లేదని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో తిండి లేదని, తరచుగా ఫుడ్ పాయిజన్ అవుతోందని అన్నారు. విద్యాసంస్థల్లో చాక్ పీసులకు గతి లేక విద్యార్థులు రోడ్డు మీదకొచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, ఉపాధ్యాయులు లేరని ఆరోపించారు. ఇక పేదలకు ఇళ్లు ఇవ్వడం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు మంజూరు చేసిన ఇళ్లను కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ నాందేడ్ సభను బహిష్కరించాలి: సోయం బాపూరావు
రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసి ఆదివాసీ ఆడబిడ్డను అవమానించిన బీఆర్ఎస్‌ పార్టీ ఏర్పాటు చేసే సభకు ఎవరూ వెళ్లొద్దని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పిలుపునిచ్చారు. మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి ఆదివాసీ ఆడబిడ్డ రాష్ట్రపతి అవుతుంటే బీఆర్ఎస్ ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేసిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గిరిజన-ఆదివాసీలందరూ మహారాష్ట్రలో బీఆర్ఎస్ తలపెట్టిన సభను బహిష్కరించాలని అన్నారు. అంతేకాదు, ఆదివాసీ రాష్ట్రపతికి జరిగిన అవమానం, అన్యాయంపై బీఆర్ఎస్ నాయకత్వాన్ని నిలదీయాలని ప్రజలను కోరారు. తెలంగాణలో పోడు భూములకు పట్టాలు అంటూ కేసీఆర్ నాలుగైదు సార్లు చెప్పిందే చెప్పి మోసగించారని, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మాయమాటలు చెప్పి మోసగించాలని చూస్తున్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement