Tuesday, November 26, 2024

పంత్‌, సంజూ, ఇషాన్‌ల సంగతేంటి?

వచ్చేఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో రాణించి, ఐసీసీ ట్రోఫీని ఒడిసి పట్టుకోవాలని బీసీసీఐతో పాటు టీమిండియా ప్రణాళికలు రచిస్తున్నంది. ఇటీవల కాలంలో అంతగా రాణించలేకపోతున్న రిషబ్‌ పంత్‌, సంజూశాంసన్‌, ఇషాన్‌ కిషన్‌లను పక్కన పెడుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. బంగ్లాదేశ్‌ టూర్‌కు రిషబ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌లను ఎంపిక చేసినప్పటికీ, తొలి వన్డేలో ఆ ఇద్దరినీ ఆడించలేదు. ప్రధానంగా రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ను కాదని, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలను రోహిత్‌ శర్మ అప్పగించాడు. చాలా కాలం తర్వాత రాహుల్‌ జాతీయ జట్టులో వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు నిర్వహించాడు. ఇది ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్న ప్రణాళికల్లో భాగమేనని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ సమాచారం.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రిషబ్‌ పంత్‌కు ఘనమైన రికార్డులేమీ లేవు. అదీగాక గడిచిన ఏడాదిన్నర కాలంగా పంత్‌ వైట్‌బాల్‌ క్రికెట్‌లో అత్యంత దారుణంగా విఫలమవుతున్నాడు. బీసీసీఐ పెద్దల అండదండలతో పంత్‌ నెగ్గుకొస్తున్నాడని ఆరోపణలున్నాయి. పంత్‌ స్థానంలో సంజూ శాంసన్‌ను ఆడించాలని అభిమానుల నుంచి ఒత్తడి వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పంత్‌తో పాటు, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ కూడా జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌లిద్దరూ వికెట్‌ కీపింగ్‌తోపాటు బ్యాటింగ్‌ కూడా చేయగల సమర్ధులు. జట్టులో ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపినా ఆడగలిగేవాళ్లే.

- Advertisement -

తాజా పరిణామాల నేపథ్యంలో పంత్‌, శాంసన్‌, ఇషాన్‌లు వరల్డ్‌ కప్‌ మీద ఆశలు వదులుకోవాల్సిందేనని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీ20లో రాణిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా మెరుస్తాడని భావిస్తున్న టీమ్‌ మేనేజ్‌మెంట్‌ జట్టులో అతడి స్థానం సుస్థిరం చేసి, బ్యాటింగ్‌ ఆర్డర్‌ను పటిష్టం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. అదే జరిగితే కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపర్‌గా కొనసాగుతారు. పంత్‌, శాంసన్‌, ఇషాన్‌లు జట్టులోకి వచ్చే అవకాశం కోల్పోయినట్లేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement