నార్కోటిక్స్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. పుణె, ఢిల్లీలో జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నిషేధిత మెఫిడ్రోన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యాన్ని మియావ్ మియావ్ అని పిలుస్తారు. రెండు నగరాల్లో జరిపిన దాడుల్లో సుమారు 2500 కోట్ల విలువైన మెఫిడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తొలుత పుణెలో ముగ్గురు డ్రగ్ స్మగ్లర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 700 కేజీల మెఫిడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గుర్ని విచారించిన తర్వాత మరికొన్ని విషయాలు తెలిశాయి. వాళ్లు సమాచారం మేరకు ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ఏరియాలో సోదాలు నిర్వహించారు. వారి వద్ద నుంచి సుమారు 400 కేజీల సింథటిక్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పుణె నుంచి ఢిల్లీకి సప్లయ్ చేస్తుంటే..
పుణెలోని మరో ప్రదేశం నుంచి భారీ మొత్తంలో మెఫిడ్రోన్‌ను రికవరీ చేశారు. కుర్‌కుంబ్ ఎంఐడీసీ ఏరియా నుంచి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుణె నుంచి ఆ డ్రగ్‌ను ఢిల్లీకి సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో పోలీసులు అయిదుగురిని ఆధీనంలోకి తీసుకున్నారు. దీంట్లో ముగ్గురు కొరియర్లు కూడా ఉన్నారు. మరో ఇద్దర్నీ విచారిస్తున్నారు.