కింగ్ స్టన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. మ్యాచ్ చివరి వరకూ ఆసక్తికరంగా సాగగా.. విండీస్ ఒక వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ తడబడినా బౌలర్ కీమర్ రోచ్ (30) సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. 142 పరుగులకే 8 వికెట్లు కోల్పయినా.. జోమెల్ వారికన్ (6), జేడెన్ సీల్స్ (2) అండతో రోచ్ జట్టును గట్టెక్కించాడు.
ఓవర్‌నైట్ స్కోరు 160/5తో నాలుగో రోజైన ఆదివారం ఆటను కొనసాగించిన పాకిస్థాన్.. రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఇమ్రాన్ బట్ డకౌట్ అయినా.. మరో ఓపెనర్ అబిద్ అలీ (34) రాణించాడు. స్టార్ బ్యాట్స్‌మన్ అజర్ అలీ (23) విఫలమవగా.. కెప్టెన్ బాబర్ ఆజామ్ (55) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మొహ్మద్ రిజ్వాన్ (30), ఫహీమ్ అష్రాఫ్ (20), అసన్ అలీ (28) పరుగులు చేశారు. విండీస్ పేసర్ జేడెన్ సీల్స్ ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలో టెస్టుల్లో విండీస్ తరఫున 5 వికెట్ల ఫీట్ సాధించి పిన్న వయసు బౌలర్‌గా 19 ఏళ్ల సీల్స్ రికార్డులకెక్కాడు. ఈ విజయంతో విండీస్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈనెల 20న ఆరంభం కానుంది.
ఈ వార్త కూడా చదవండి: కోహ్లీకి కౌంటర్ ఇచ్చిన బ్రాడ్.. అవును లార్డ్స్ అండర్సన్ జాగీరే..!!