వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం రెండు రైళ్లు ఢీకొన్ని సంఘటనలో చనిపోయిన వారి సంఖ్య 15కి పెరిగింది. డార్జిలింగ్ జిల్లాలో ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో ఓ బోగీ గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు మృతిచెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సీల్దాకు బయల్దేరిన కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్ మధ్యలో న్యూజల్‌పాయ్‌గుడి వద్ద ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలో వెనక నుంచి ఓ గూడ్స్ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది.
సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రెడ్ సిగ్నల్ వేసినా గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాగా ట్రాక్ పై పడిన రైళ్ల బోగీలను తొలగించారు సిబ్బంది. అలాగే ట్రాక్ ను మరమ్మతులు చేసి రైళ్ల రాకపోకలను పునరుద్దరించారు..
మరోవైపు, ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విచారం వ్యక్తంచేశారు. ‘ఈ విపత్కర సమయంలో నా ఆలోచలన్నీ బాధిత కుటుంబాల వెంటే ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. సహాయక చర్యలు విజయవంతమవ్వాలి’ అని ముర్ము ఆకాంక్షించారు.
పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాద ఘటన తీవ్ర విచారకరమని ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.