నెల్లూరు.. ప్రభ న్యూస్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అండగా నిలుస్తాయని , నూరు శాతం విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో ఉత్సాహభరితంగా సాగిన పురపాలక పోరు .. పార్టీ అభ్యర్థులు , కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పురపాలక ఎన్నికల సందర్భంగా పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. నెల్లూరు కార్పొరేషన్‌కు సంబంధించి 54 డివిజన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించాలని , అందుకోసం నాయకులు , కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడుతాయని చెప్పిన ఆయన .. పార్టీ తరపున అభ్యర్థులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ నాయకులు , అభ్యర్థులు , కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించి పురపాలక ఎన్నికల్లో విజయదుందుభి మోగించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ , వలంటీర్లు , సంక్షేమ పథకాలపై మరింత ప్రచారం , ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
అన్ని డివిజన్లలో విజయం సాధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నెల్లూరు కార్పొరేషన్ గెలుపును కానుకగా ఇవ్వాలని కోరారు. నెల్లూరు జిల్లా ప్రజలు తొలి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారని , అందుకు జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ , నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోంటరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాద్ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్‌కుమార్ యాదవ్ , నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి , నగరంలోని డివిజన్లకు పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు , కార్యకర్తలు పాల్గొన్నారు.