Wednesday, November 20, 2024

కేసిఆర్‌ పాలనతో ప్రతి ఇంటా సంక్షేమం.. లబ్ధిదారులకు పించన్ కార్డుల పంపిణీ: వెంకటేశ్ నేత

గోదావరిఖని (ప్రభ న్యూస్) రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో ప్రతి పథకం సంక్షేమానికి నిలువుటద్దంగా నిలుస్తోందని, పేద ప్రజల ముఖాల్లో సంతోషాన్ని చిగురించేలా చేస్తున్నాయని పెద్దపల్లి ఎంపి వెంకటేష్‌ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు పేర్కొన్నారు. గురువారం స్థానిక శ్రీలక్ష్మి ఫంక్షన్‌ హాల్‌లో రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పెన్షన్‌ దారులకు కార్డులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు బాధపడకూడదనే గొప్ప సంకల్పంతో సంక్షేమ పథకాలు, అందేవిధంగా పనిచేయలేని వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు ఆర్థికంగా అండగా ఉంటూ.. పెన్షన్‌ను అమలుచేస్తున్న ప్రజామోద పాలకుడిగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ చరిత్రలో నిలిచిపోయారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాష్ట్రంలో ఆకలిచావులు, ఆత్మహత్యలు ఉండకూడదనే దృఢ సంకల్పంతో పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.2000వరకు పెంచి తల్లులకు, అక్కలకు, వికలాంగులకు ఆసరాగా వెన్నంటూ నిలబడిన మహోన్నత వ్యక్తి కేసిఆర్‌ ఆన్నారు. 57ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్‌ అమలు చేయాలని కేసిఆర్‌ గారు సంకల్పించారన్నారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అమలుచేయని సంక్షేమ పథకాలను కేసిఆర్‌ తెలంగాణాలో అమలు చేస్తూ దేశం గర్వించదగిన నాయకుడిగా ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

పేద ఆడబిడ్డలకు కేసిఆర్‌ ఒక పెద్దన్నగా నిలిచి, వారిపెళ్లిలో తనవంతు బాధ్యతగా రూ.లక్షా 116లను కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా అందిస్తున్నారన్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు వారి ఆరోగ్యంకోసం పౌష్టికాహారం, ప్రసవం తరువాత నవజాత శిశువుకు కేసిఆర్‌ కిట్‌తో పాటుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారన్నారు. వృద్దులు, వితంతువులు, వికలాంగులు ఎవరి మీద ఆధారపడకూడదని, తమ ఆర్థికపరమైన అవసరాలను తామే స్వంతగా తీర్చుకోవడానికి రూ,2016లను పెన్షన్‌ను అమలుచేస్తున్నారని, దీంతో కుటుంబంలో, సంఘంలో వారికి గౌరవ మర్యాదలు నిలుస్తాయన్నారు. తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి, తెలంగాణాను సాధించుకున్నామని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు, ప్రతి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తోందన్నారు. బంగారు తెలంగాణా కళ్ల ముందు సాక్షాత్కరమయ్యే సమయం ఆసన్నమైందని, అర్హులైన వారందరికి పెన్షన్‌ వస్తుందని, ఎవరూ అధైర్యపడకూడదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ డాక్టర్‌ బంగి అనిల్‌ కుమార్‌, డిప్యూటి మేయర్‌ నడిపల్లి అభిషేక్‌ రావు, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సుమన్‌రావు, కార్పొరేటర్లు బాలరాజ్‌కుమార్‌, ఎన్వీ రమణారెడ్డి, జనగామ కవితా సరోజిని, నాయకులు పాతిపల్లి ఎల్లయ్య, అడ్డాల రామస్వామి, నూతి తిరుపతి, అడప శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement