Tuesday, November 26, 2024

కన్నీళ్లు పెట్టిస్తున్న వరిసాగు.. యాసంగి వరిపై తెగుళ్లు, మొగిపురుగు దాడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈ ఏడాది వరి సాగు రైతులకు నష్టాలు, కష్టాలనే మిగల్చనుంది. యాసంగిలో సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉండడంతో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షలకు పైగా ఎకరాల్లో వరి నాట్లు వేశారు. అయితే పెట్టుబడి కోసం కష్టాలతోపాటు కూలీల కొరత ఇతర అనేక వ్యయప్రయాసాలకోర్చి ఎదుర్కొని అదనులో వరినాట్లు పూర్తి చేశామన్న సంతోషం రైతులకు లేకుండాపోయింది. నాట్లు పూర్తయి వరి కర్రలు పచ్చబడుతున్న సమయంలోనే తెలంగాణ వ్యాప్తంగా వరిపై వివిధ రకాల పోషకాల లోపాలు, దోమకాటు, మొగిపురుగు, కాండంకుళ్లు, వేరుకుళ్లు తదితర రోగాలు, తెగుళ్లు దాడి చేస్తున్నాయి. దీంతో వరి ఎర్ర బడుతూ , ఎదుగుదల ఆగిపోయి, దుబ్బులకు దుబ్బులే చచ్చిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాట్లు వేసిన రెండు వారాల్లోనే పంటను తెగుళ్లు ఆశించి వరి దుబ్బులు కుళ్లిపోతుండడంతో ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కూరుకుపోయారు.

ఈ ఏడాది సమృద్ధిగా భూగర్భజలాలు, సాగునీరు అందుబాటులో ఉండడంతో రైతులు యాసంగిలో ఎక్కువగా వరిసాగుకే మొగ్గు చూపారు. సాగునీరు సమృద్దిగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో యాసంగి రైతు బంధును అందించడంతో ధైర్యంగా, సంతోషంగా నవంబరు డిసెంబరు రెండో వారం నుంచే విస్తారంగా వరినాట్లు వేశారు. పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగినా తట్టుకున్న రైతన్నలపై ప్రకృతి కూడా కన్నెర్ర చేస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో అధిక వర్షాలకు వరి , పత్తి పంటలు అనేక రోగాల బారిన పడ్డాయి. ఖరీఫ్‌లో కాటుక తెగులు, దోమకాటు కారణంగా పెద్ద మొత్తంలో వరి దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు కనీసం 30 క్వింటాళ్ల వడ్లు కావాల్సిన చోట 80శాతం మంది రైతులకు దిగుబడి ఎకరాన 20 క్వింటాళ్లకే పరిమితమైంది. సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉన్నందున కనీసం యాసంగిలోనైనా వరిసాగుతోనైనా ఆర్థిక కష్టాలనుంచి బయటపడతామన్న రైతుల ఆశలపై వరిలో కాండంకుళ్లు, వేరుకుళ్లు తెగుళ్లు, దోమకాటు, మొగిపురుగు రోగాలు నీళ్లు చల్లాయి. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 90శాతం మేర వరినాట్లు పూర్తయ్యాయి. వరినాట్లకు ఫిబ్రవరి చివరి వరకు అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement