ప్రభ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : గడిచిన రెండేళ్లు కొవిడ్ కారణంగా పెళ్లిళ్లు అంతంత మాత్రంగానే జరిగాయి. అవి కూడా లిమిటెడ్ సభ్యుల హాజరుతో ఇంటి వేడుకగానే జరిగాయి. అయితే గత ఏడాదిగా కొవిడ్ పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో తిరిగి పెళ్లిళ్లు ఊపందుకున్నాయి. 2022మొదటి భాగంలో ముహుర్తాలు అంతంత మాత్రంగా ఉండటంతో నామ మాత్రంగానే జరిగాయి. తాజాగా కార్తిక మాసం చివరి అంఖమైన డిసెంబర్ రెండు, మూడు వారాల్లో పెళ్లిళ్లకు మంచి ముహుర్తాలు ఉండటంతో నగరంలో భారీగా వివాహాలు జరగనున్నట్లు పండితులు చెబుతున్నారు.
డిసెంబర్ 2,7,8,9,14 తేదీల్లో హైదరాబాద్‌లో దాదాపు లక్షకు పైగా పెళ్లిళ్లు జరగనున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ మాసం వివాహాలకు అనుకూలంగా ఉండటం, ముహుర్తాలు కలిసి రావడం, అమెరికా తదితర దేశాల్లో ఉండే ఎన్‌ఆర్‌ఐలకు సెలవులు కలిసి రావడంతో నగరంలో పెళ్లి సందడి కనిపించనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని అన్ని బాంకెట్ హాళ్లు, కళ్యాణ పండపాలు హౌస్ పుల్ అయ్యాయి. పెండ్లి మండపాలు దొరకని వారు తమ ఇంటి ఆవరణలో ఉండే ఖాళీ స్థలాల్లో చేసేందుకు సన్నద్దం అవుతున్నారు. మొత్తానికి రెండేళ్ల తర్వాత డిసెంబర్ మాసంలో భాగ్యనగరం పెళ్లిళ్లతో మార్మోగనుంది.
భారీగా పెరగనున్న ఖర్చు
కొవిడ్ కాలంలో పెళ్లిళ్లు సాదారణంగా జరగడంతో ఖర్చు కూడా తక్కువగా ఉండేది. కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉండటం, నిరాడంబరంగా వివాహం చేయడం మూలాన ఆడ పెళ్లి వారికి భారీగా ఖర్చు కలిసి వచ్చింది. గతంలో నగరంలో సాధారణ మద్యతరగతి కుటుంబాలు రూ.3 నుంచి రూ.5 లక్షల లోపు అయ్యేవి. ఈ సారీ అంతకు రెండింతలు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్క ఫంక్షన్ హాల్ లేదా బాంకెట్ హల్ బుకింగ్‌లే రూ.5 లక్షల వరకు అవుతాయని భావిస్తున్నారు. గ్రాండ్‌గా జరిగే వివాహాల ఖర్చును అంచనా వేయడం కష్టమని వెడ్డింగ్ ప్లానర్‌లు అంటున్నారు. రూ.25 లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా ఖర్చు చేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. కాగా డిసెంబర్‌లో నగరంలోజరగనున్న పెళ్లిళ్లు కాస్ట్‌లీ పెళ్లిళ్లుగా రికార్డు కెక్కనున్నాయి.