వరంగల్, ప్రభన్యూస్, ప్రతినిధి: పీజీ వైద్య విద్య కన్వీనర్ కోటా సీట్లకు మరో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఇంకా ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మరోఅవకాశం కల్పిస్తూ తాజాగా ఎంసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ బుధవారం స్పెషల్ స్ట్రే విడుదల ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
ఇప్పటికే నాలుగు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను ఈ చివరి విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 12న గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హతగల వారు ఇతర వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ WWW.KNRUHS.TELANGANA.GOV.IN లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.