వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి: యూజీ ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి కాను ఈనెల 14వ తేది వరకు స్ట్రే వేకెన్సీ విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యింది.
యూనివర్సిటీ పరిధిలోని ఆయూష్ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎస్), ఆయుర్వేద (బీఏఎంఎస్), యునాని (బీయూఎంఎస్), నేచురోపతి-యోగా(బీఎన్‌వైసీ) కోర్సుల్లో మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 14వ తేది మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్ధులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్ధులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్ WWW.KNRUHS.TELANGANA.GOV.IN ను చూడవల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.