సమ్మర్ వచ్చేస్తోంది. రానున్న 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర సహా తెలంగాణలోని ఉత్తర, తూర్పు భాగాల్లో ఎండతీవ్రత బాగా పెరిగే అకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ప్రస్తుతం 35-36 డిగ్రీల మధ్య ఉన్న ఉష్ణోగ్రతలు.. త్వరలోనే 38-39 డిగ్రీలకు పెరుగుతాయని తెలిపింది. పలు చోట్ల 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడిచిన రెండేళ్లుగా కరోనా విలయతాండవం చేయడంతో లాక్‌డౌన్‌లోనే సమ్మర్ మూడు నెలలు గడిచిపోయింది. స్కూళ్ళు, కళాశాలలు మూతబడగా, వ్యాపార, వాణిజ్య సముదాయాలు నిర్ణీత వేళల్లోనే పనిచేశాయి. వర్క్ ఫ్రంహోం అమల్లోకి రావడంతో అత్యధికశాతం మంది ఉద్యోగులు ఎంచక్కా ఇంటిపట్టునే ఉండి కూల్..కూల్‌గా ఆఫీసు కార్యకలాపాలు చక్కబె ట్టేశారు.
కరోనా థర్డ్ వేవ్ (ఒమిక్రాన్) కూడా పూర్తయింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగడంతో థర్డ్ వేవ్‌లో పెద్దగా ప్రమాదం జరగలేదు. కరోనా ఆంక్షలు లేకపోవడంతో కళాశాలలు, పాఠశాలలు యథావిధిగా నడు స్తున్నాయి. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. వ్యాపార, వాణిజ్యకార్యకలాపాలు యథావిధిగా నడుస్తున్నాయి. వర్క్ ఫ్రం హోంకు బైబై చెప్పేసి ఉద్యోగులు ఆఫీసుబాట పట్టారు. క్రమేపీ రెండేళ్ళ ముందు ఉన్న సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలపై ప్రభావం చూపనున్నాయి.
జాగ్రత్తలు అవసరం..
వేసవి కాలంలో వడదెబ్బ తగలడం, డీహైడ్రేషన్ కు గురవ్వడం లాంటి సమస్యలు వస్తాయి. ఎండ కాలంలో వీలైనంత వరకు ఇంటిపట్టునే ఉండటం మంచిది. ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఉదయం 10 గంటలలోపే పూర్తి చేసుకోవాలి. లేదా సాయంత్రం ఆరు దాటిన తర్వాత బయటకు వెళ్లడం మంచిది. ఎండ కాలంలో నీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాయామం చేయకూడదు. ఏదైనా ఇబ్బందులు తల్తెతితే డాక్టర్ ను సంప్రదించాలి. వేసవిలో మజ్జిగ, బార్లీ, కొబ్బరి నీరు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..