ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది భారత్. విశాఖ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆసీస్‌ను 2 వికెట్లతో తేడాతో ఓడించిన టీమిండియా రెండో టీ20 పోరుకు సిద్ధమైంది. రేపు (ఆదివారం) కేరళలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికాగా ఆస్ట్రేలియాతో రెండో T20 మ్యాచ్ లో ఇరుజట్లు తలపడనున్నాయి.
ఇక విశాఖలో జరిగిన మొదటి మ్యాచ్‌లో గెలుపు వాకిట దాకా వచ్చిన ఆస్ట్రేలియా, మిగతా మ్యాచ్‌లలో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది. మొదటి టీ20లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన బౌలర్లు, రేపటి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నారు. సిరీస్‌లో రెండవ మ్యాచ్‌లోనూ నెగ్గాలని భారత్ భావిస్తోంది. జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రుతురాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్ వంటి బ్యాటర్ల నుండి జట్టు మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. మొన్నటి మ్యాచ్‌లో హీరోలుగా నిలిచిన సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్‌లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు జరిగే సూచనలున్నాయి. ప్రపంచ కప్ 2023 ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్, స్పిన్నర్ ఆడమ్ జంపా తిరిగి జట్టులోకి రానున్నారు. అదే జరిగితే మాథ్యూ షార్ట్, తన్వీర్ సంఘా తమతమ స్థానాలు కోల్పోయినట్టే.
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. శనివారం కోస్టల్ సిటీలో వర్షం పడింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం, ఆదివారం ఉదయం మరింత వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం ఆగిపోవచ్చని అంచనా. కాగా, గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పిచ్ పరిస్థితులు భిన్నంగా ఏమీవుండవు. భారత బౌలర్లు సమిష్టి రాణించడం అవసరం.
Sports18 నెట్‌వర్క్ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేస్తుంది. మ్యాచ్ డీడీ ఫ్రీ డిష్‌లో కూడా ప్రసారం అవుతుంది. జియో సినిమా యాప్‌లో ఉచితంగా చూడొచ్చు.
తుది జట్లు ఇలా (అంచనా)
భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్, కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా.