విదర్భ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆగ్నేయ అరేబియా సముద్రం, దానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఈ ప్రభావంతో ఈ నెల 14న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఈనెల 16 నాటికి తూర్పు అరేబియా సముద్రంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రానున్న 4 గంటల్లో అంటే గురువారం రాత్రికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంత జిల్లాల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఒడిశా నుంచి వచ్చే మేఘాల వల్ల ఉత్తరాంధ్రలో వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.