దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ శిఖరాగ్ర సమావేశంలో అనూహ్యంగా సంపన్న వర్గాల వారి నుంచి నిరసన వెల్లువెత్తింది. ‘ది పేట్రియాటిక్ మిలియనీర్స్’ అనే గ్రూప్ సభ్యులు ఈ నిరసనకు పూనుకున్నారు. ‘ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభాలలో కూరుకుపోతుంటే… బిలియనీర్లు, ప్రపంచ నేతలు ఇక్కడ సమావేశమై చరిత్ర మలుపులు తిప్పే అంశాలపై చర్చలు జరుపుతున్నారు. దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయకులలో చాలా మందికి ఈ ఆర్థిక సంక్షోభం ప్రభావం తీవ్రత గురించి చాలా తక్కువ మాత్రమే తెలుసు. ఈ సమావేశాలు తేల్చే అంశం ఒక్కటే ఉంటుంది. అది… సంపన్నులపై మరిన్ని పన్నులు వేయడమే. ఆ పన్నులేవో ఇప్పుడే వేయండి.. దావోస్ 2022కు హాజరవుతున్న ప్రతినిధులపై పన్ను వేయండి’ అని ఈ గ్రూప్‌నకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిల్ వైట్ తెలియజేసినట్లు ది గార్డియన్ తెలియజేసింది.
ఈ ఏడాది ‘వర్కింగ్ టూ గెదర్.. రిస్టోరింగ్ ట్రస్ట్ నినాదంతో ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తెలుసుకొని, భవిష్యత్తులో రానున్న కష్టకాలం నుంచి బయటపడడానికి విధానాలను ఖరారు చేయడంలో ఈ సమావేశం ప్రపంచ నాయకులకు ఓ అవకాశాన్ని ఇస్తుందన్న ఆశాభావాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వ్యక్తం చేసింది. మహమ్మారి నుంచి బయటపడడం, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడం, మంచి భవిష్యత్తు నిర్మించడం, నాల్గవ పారిశ్రామిక విప్లవానికి మార్గాన్ని సుగమం చేయడం ఈ సమావేశాల ఏజెండాలోని కీలక అంశాలు. అయితే, ఈ చర్చలేవీ ఫలితాలు ఇవ్వవని పేట్రియాటిక్ మిలియనీర్స్ గ్రూప్ అంటున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..