అకారణంగా తమ దేశంపై యుద్ధానికి చేసి వేలాదిమంది ప్రాణలు తీసి, ఆస్తినష్టాన్ని కలిగిస్తున్న రష్యాపై విజయం సాధించి తీరుతామని, ఫలితంగా మరో విక్టరీ డేను నిర్వహించుకునే అవకాశం లభించబోతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విశ్వాసం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయం సాధించినందుకు గుర్తుగా మే 9న విక్టరీడేను పాటిస్తున్నామని, మునుముందు రష్యాపై గెలిచి మరో విక్టరీడేను నిర్వహించు కోబోతున్నామని స్పష్టం చేశారు. జర్మనీపై గెలుపునకు గుర్తుగా జెలెన్‌స్కీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండోప్రపంచ యుద్ధంలో యూఎస్‌ఎస్‌ఆర్‌లో భాగమైన ఉక్రెయిన్ స్వాతంత్య్రం తరువాత సొంతంగా విజయోత్సవాలను నిర్వహిస్తోంది. ఆ యుద్ధంలో అసువులు బాసినవారికి నివాళి అర్పిస్తోంది.
నాటోతో ముప్పు.. తప్పు..
కాగా నాటోతో ముప్పు కారణంతోనే ఉక్రెయిన్‌పై సైనికచర్యకు పాల్పడినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలను ఉక్రెయిన్ తిప్పికొట్టింది. క్రిమియాపా దాడి చేయాలని కానీ, రష్యా భూభాగాలను ఆక్రమించుకోవాలనిగానీ ఉక్రెయిన్ ఎప్పుడూ అనుకోలేదని తేల్చిచెప్పింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారు మైఖెయిలో పొడొలియాక్ ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించారు. రష్యా సైనికవ్యవస్థ కొనఊపిరితో ఉ ంది. మరణం తప్పదు. వారు మాతృదేశాన్ని రక్షించడం లేదు.. పొరుగు దేశాలను ఆక్రమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా యుద్ధానికి సహేతుక కారణాలు లేవని పేర్కొన్నారు. కాగా పోలండ్‌లో రష్యా రాయబారికి చేదు అనుభవం ఎదురైంది. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రష్యా సైనికులకు నివాళి అర్పించేందుకు వార్సాలోని సెమెట్రీకి వచ్చిన ఆ దేశ రాయబారి సెర్జీ ఆండ్రీవ్‌పై కొందరు ఎర్రటి రంగును జల్లారు. రష్యా సైనిక చర్యలను తప్పుబడుతూ నిరసనకారులు ఈ దాడికి పాల్పడ్డారు.
జీ-7 నేతలతో బిడెన్ భేటీ..
గ్రూప్ – 7 దేశాల నేతలతో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించే విషయమై చర్చించారు. ఈ భేటీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఆహ్వానం అందింది. వర్చువల్ భేటీలో వీరంతా మాట్లాడుకున్నారు. రష్యాను నిలువరించే విషయంలో జీ-7 దేశాలు ఏకతాటిపై ఉండటాన్ని బిడెన్ ప్రశంశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..