న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కానుకగా అందిస్తామని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు డా. కే. లక్ష్మణ్ అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన న్యూఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన డా. లక్ష్మణ్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి తనను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసినందుకు ధన్యావాదాలు తెలిపానన్నారు. ఈ భేటీలో ఓబీసీ మోర్చాను దేశవ్యాప్తంగా మండలస్థాయి వరకు విస్తరించడంతో పాటు క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం గురించి అమిత్ షాతో చర్చించానని అన్నారు. ఓబీసీల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాల గురించి గ్రామగ్రామాన వివరించి చెబుతున్నామని, ఆ దిశగా అనేక కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టామని వివరించారు. ఈ క్రమంలో ఓబీసీ పారిశ్రామికవేత్తలతో సదస్సు, ఓబీసీ వ్యాపారవేత్తల కోసం రూ. 200 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్, దాని వల్ల కల్గుతున్న ప్రయోజనాలను వివరించానని డా. లక్ష్మణ్ అన్నారు. యువతను ఉద్యోగార్థిగా కాకుండా ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జాతీయస్థాయిలో ఓబీసీ మోర్చా చురుగ్గా, క్రియాశీలకంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.
తెలంగాణలో మార్పు తథ్యం!
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్‍పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని లక్ష్మణ్ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీకే అనుకూలమని సూత్రీకరించారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా క్రమక్రమంగా కనుమరుగవుతోందని, ప్రజలకు ఆ పార్టీపై నమ్మకం లేదని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీజేపీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసేందుకు కలసికట్టుగా పనిచేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షాతో చెప్పినట్టు వెల్లడించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం సైతం తెలంగాణపై దృష్టి కేంద్రీకరించిందని, అందులో భాగంగానే 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో మళ్లీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశాలు ముగిసిన వెంటనే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ ఏర్పాటు చేయాలన్న తమ ప్రతిపాదనకు జాతీయ నాయకత్వం అంగీకరించిందని లక్ష్మణ్ వెల్లడించారు. ఇక తెలంగాణ బీజేపీలో చేరికలు ఆగిపోయాయన్నది పూర్తిగా అవాస్తవమని లక్ష్మణ్ అన్నారు. క్షేత్రస్థాయి నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని చెప్పారు. అలాగే పార్టీలో కొత్తగా చేరినవారికి బాధ్యతలు అప్పగించడం లేదన్న మాటల్లోనూ నిజం లేదని, కొత్తగా చేరిన నేతల్లో ఐదుగురికి జాతీయస్థాయిలో పార్టీ బాధ్యతలు అప్పగించిందని గుర్తుచేశారు. పాతవారిని, కొత్తగా చేరిన వారిని కలుపుకుపోతూ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా కార్యాచరణ రూపొందిచామని డా. లక్ష్మణ్ అన్నారు. పార్టీని నమ్ముకుని కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు బీజేపీలో మంచి అవకాశాలు ఉంటాయని అన్నారు. తనకు పెద్దల సభలో అవకాశం కల్పించడం అందులో భాగమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలను ఒకతాటిపైకి తీసుకొచ్చి వారిని బీజేపీ వైపు నడిపించేలా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.