న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో 12 నుంచి 14 పార్లమెంట్ సీట్లు తమ పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా మాట్లాడారు. 2014 నుంచి 2023 వరకు ప్రతిపక్ష పాత్రలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టార్గెట్ లోక్‌సభ ఎన్నికలని చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉందని, ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో క్లీన్ స్వీప్ చేయగలిగినా, ఉత్తర తెలంగాణలో ఇంకా ప్రజల మద్దతు సాధించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
లోక్‌సభ ఎన్నికల్లో తమకు అవకాశాలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మరింత బలం పెంచుకోవాలని, ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల ప్రభావం లోక్‌సభ ఎన్నికల మీద కూడా ఉంటుందని దయాకర్ విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీ పథకాలను అమలు చేస్తున్న తీరును బట్టే ప్రజలే తమ వెంట నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలను మార్చి 17లోగా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు.
రైతులు, విద్యార్థులకు తమ ప్రభుత్వం చేయూతగా నిలుస్తుందని వివరించారు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యుడిగా తన పేరు వినిపిస్తున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గ ఎంపీగా తన పేరు ప్రచారంలో ఉన్నా, తానైతే ఏదీ కోరలేదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికే తనకు సీటు కేటాంపు విషయాన్ని వదిలేశానని తేల్చి చెప్పారు. తాను ఎక్కడ, ఏ పదవికి న్యాయం చేయగలనని వారు భావిస్తారో అక్కడ తన సేవలు అందిస్తానని దయాకర్ స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలను బట్టి మెరుగైన అవకాశం కోసం ఎదురు చూస్తుంటానని వెల్లడించారు.
ప్రస్తుతం ఢిల్లీ ఎందుకు వచ్చారనే దాని మీదా అద్దంకి దయాకర్ స్పష్టతనిచ్చారు. తన ఢిల్లీ పర్యటన కేవలం తాను హీరోగా నటించిన సినిమా ప్రమోషన్ కోసమేనని చెప్పారు. తన సినిమా విడుదల కోసం కాంగ్రెస్ పెద్దల నిర్ణయం, అభిప్రాయం తీసుకోవడానికే ఇక్కడికి వచ్చానని అన్నారు. ఎన్నికలకు ముందే సినిమాను విడుదల చేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. అతి త్వరలో ఆ చిత్రం ప్రజల ముందుకు రాబోతోందని సంతోషం వ్యక్తం చేశారు.