Thursday, December 12, 2024

TG | కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించి బీజేపీ జెండా ఎగురవేస్తాం : కిషన్‌రెడ్డి

బీఆర్‌ఎస్ – కాంగ్రెస్‌ పార్టీలవి ఒకే డీఎన్‌ఏ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు మేలు జరగలేదని, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలోనూ అదే జరుగుతోందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ఒకే తాను ముక్కలని… పాలనలో కేసీఆర్‌-రేవంత్‌రెడ్డి కవలపిల్లల్లాంటివారని అన్నారు.

డిసెంబరు 9న సోనియా జన్మదినం సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని, పెన్షన్లు రూ.2000 నుంచి రూ.4 వేలు చేస్తామని పలు హామీలిచ్చి.. ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 12 నెలలు గడిచినా ఒక్క కొత్త రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

- Advertisement -

కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఫల్యాలపై ఉద్యమ శంఖారావం పూరించామని, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దెదించి బిజెపి జెండా ఎగురవేసేంత వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం, ఉద్యమకారుల ఆకాంక్షల కోసం బిజెపి అంకితభావంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement