న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, టీయూడబ్ల్యుజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, సీనియర్ జర్నలిస్ట్ వంశీతో కలిసి శనివారం ఆయన ఢిల్లీ వచ్చారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో కలిశారు. రమణకు శాలువా కప్పి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో సానుకూల తీర్పు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఐజేయూ నేతలు కూడా ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై ఇచ్చిన తీర్పుతో జర్నలిస్టులకు న్యాయం చేశారంటూ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అంతకుముందు అల్లం నారాయణ, క్రాంతి కిరణ్, మారుతీ సాగర్, వంశీని ఢిల్లీ టీయూడబ్ల్యుజే కమిటీ, సభ్యులతో సమావేశమయ్యారు. జర్నలిస్టుల సమస్యలను వారు అడిగి తెలుసుకున్నారు. పాత్రికేయులకు సహాయ సహకారాలందిస్తున్న వారందరినీ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ… ఢిల్లీ చాలా మంది జర్నలిజం కెరీర్‌కు బాగా ఉపయోగపడిందన్నారు. భాషా పరంగా, వార్తల పరంగా, కాంటాక్ట్స్, జాతీయ రాజకీయాలను గమనించడం వంటి అంశాల్లో విలేకరులకు ఎంతో ఉపయోగరమని చెప్పారు. ఎంతో మంది సీనియర్ జర్నలిస్టులు ఇక్కడ పని చేసి వెళ్లి వారి అనుభవాలతో రాసిన పుస్తకాలను చదివితే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పారు. ఢిల్లీలో పని చేసే వారికి జాతీయ నాయకులను కలిసే అవకాశం, ఇంటర్వ్యూలు చేసే అవకాశం ఉండడంతో ఎన్నో విషయాలపై విషయ పరిజ్ఞానం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఇలా అనేక వృత్తిపరమైన ప్రయోజనాలు ఉంటాయని అల్లం నారాయణ అన్నారు. అక్రిడేషన్ మొదలు జర్నలిస్టులకు వచ్చే ఏ సౌకర్యం, ప్రయోజనమైనా దేశ రాజధానిలో పని చేసే జర్నలిస్టులకు అందేలా చూస్తామని స్పష్టం చేశారు. ఏ సమస్యలనైనా ప్రెస్ అకాడమీ తరఫున పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని వెల్లడించారు. ప్రాంతాల పరంగా దూరంగా ఉన్నా మానసికంగా మాత్రం ఇక్కడి జర్నలిస్టులు తెలంగాణకు దగ్గరగా ఉన్నారని ఆయన అన్నారు. ఢిల్లీలో పని చేస్తున్న జర్నలిస్టుల ద్వారా తలెత్తిన ఆలోచనతోనే కరోనా సమయంలో వేల మందికి జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందించాలని సంకల్పించామని అల్లం నారాయణ గుర్తు చేశారు.